జీవో నెం 111 ఎత్తివేత.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ, తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

Siva Kodati |  
Published : May 18, 2023, 07:22 PM ISTUpdated : May 18, 2023, 08:40 PM IST
జీవో నెం 111 ఎత్తివేత.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ, తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

సారాంశం

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 111 జీవోను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. 

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 111 జీవోను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేకు మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి హరీశ్ రావు మీడియాకు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలనే జీవో 111 గ్రామాలకు వర్తింపజేస్తామని ఆయన వెల్లడించారు. 

కేబినెట్ ఇతర నిర్ణయాలు :

  • రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం
  • ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాల కేటాయింపు
  • మైనార్టీ కమీషన్‌లోకి జైన్ కమ్యూనిటీ
  • టీఎస్‌పీఎస్సీలో పది పోస్టుల మంజూరు
  • కులవృత్తుల బలోపేతానికి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ
  • హిమాయత్ సాగర్, గండిపేట అనుసంధానానికి కేబినెట్ ఆమోదం
  • కొత్తగా 38 డీఎంహెచ్‌వో పోస్టులు మంజూరు
  • కొత్త మండలాలకు 40 పీహెచ్‌సీలు
  • వ్యవసాయ రంగంలో మార్పులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ
  • వీఆర్ఏల క్రమబద్దీకరణకు ఆమోదం

 

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ జీవో 111ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక, ఇటీవల అసంబ్లీ సమావేశాల్లో జీవో 111ని ప్రభుత్వం త్వరలోనే రద్దు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జీవో అర్దరహితం అని పేర్కొన్నారు. “ఆ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను రక్షించడానికి జీవో జారీ చేయబడింది. అయితే ప్రభుత్వం తాగునీటి సమస్యను అధిగమించడంతో ఆ జీవో నిరుపయోగంగా మారింది’ అని కేసీఆర్ అన్నారు.

జీవో 111 గురించి..
గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనే రెండు రిజర్వాయర్‌ల ఫుల్ ట్యాంక్ లెవల్‌లో 10 కి.మీ విస్తీర్ణంలో.. భారీ నిర్మాణాలు,పారిశ్రామిక కార్యకలాపాలను నిషేధిస్తూ ఈ ఉత్తర్వు జారీ చేసింది. 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ క్రమంలోనే నగరం భారీ వరదల బారిన పడకుండా ఉండేందుకు నిజాం పాలకులు.. ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల తీసుకున్నారు. 

ఆయన సిఫార్సు మేరకు.. వరదల సమయంలో అదనపు నీటిని నియంత్రించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించారు. 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో  హిమాయత్ సాగర్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తర్వాత కాలంలో ఈ రెండు రిజర్వాయర్లు దశాబ్దాలుగా హైదరాబాద్ నగర ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చడంతో పాటు.. వరద నియంత్రణలో ముఖ్యమైన భూమిక పోషించాయి. 

జలాశయాలను రక్షించాలనే ఉద్దేశ్యంతో.. 1996లో జీవో 111ను తీసుకొచ్చారు. క్యాచ్ మెంట్ ఏరియాలో కాలుష్య కార్యకలాపాలను నివారించడానికి..సమీప ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య, భారీ నివాస నిర్మాణాలను నిషేధిస్తూ బఫర్ జోన్‌ను రూపొందించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ తదితర మండలాల్లోని 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల భూమికి జీవో 111 వర్తిస్తుంది.

జీవో ప్రకారం.. రెసిడెన్షియల్ జోన్‌లలో అభివృద్ధికి అనుమతి ఉంది.  కానీ వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేషన్‌ కోసం కేటాయించాలి. పది శాతం మాత్రమే వినియోగించాలి. కన్జర్వేషన్‌ జోన్‌లో పూర్తిగా వ్యవసాయ భూములుగానే ఉండాలి. పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోని అన్ని లేఅవుట్లలో మొత్తం విస్తీర్ణంలో.. 60 శాతం ఖాళీ స్థలంగా, రోడ్లుగా ఉంచాలి.

ఇక, కొంతకాలంగా నగరంలోని తాగు నీటి  అవసరాల కోసం ఎక్కువగా.. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం తాగునీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లపై ఆధారపడే పరిస్థితులు లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు