రాజీవ్ గాంధీ నన్ను సీఎంను చేయాలనుకున్నారు.. కానీ : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 18, 2023, 06:21 PM IST
రాజీవ్ గాంధీ నన్ను సీఎంను చేయాలనుకున్నారు.. కానీ : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చేయాలని అనుకున్నారని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తుందని.. అందుకే తమ పార్టీలోకి చాలా మంది రావాలని అనుకుంటున్నారని వీహెచ్ పేర్కొన్నారు.

టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చేయాలని అనుకున్నారని చెప్పారు. కానీ తన దురదృష్టం వల్ల సీఎంను కాలేకపోయానని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో హవా ఎక్కడుంటే రాజకీయ నాయకులు అక్కడికి రావాలని అనుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తుందని.. అందుకే తమ పార్టీలోకి చాలా మంది రావాలని అనుకుంటున్నారని వీహెచ్ పేర్కొన్నారు. అయితే హవా చూసి వచ్చే వారి కంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకే అవకాశాలు ఇవ్వాలని హనుమంతరావు కోరారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా చెబుతానని వీ హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్‌లోకి ఎవరైనా రావొచ్చని.. వచ్చిన వారికి వెంటనే పదవులు ఇవ్వకూడదని వీహెచ్ సూచించారు. 

ఇదిలావుండగా.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడినవారికి, ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకులకు వ్యూహాత్మక పిలుపు ఇచ్చారు. తమ పార్టీలోకి రావాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు, రాజేందర్ రెడ్డి మాత్రమే కాకుండా ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ అవసరమని, తెలంగాణ అభ్యున్నతిని కోరుకునేవారు తమ పార్టీలోకి రావాలని ఆయన అన్నారు. 

ALso Read: రేవంత్ రెడ్డి వ్యూహాత్మక పిలుపు: పార్టీని వీడినవారంతా వస్తారా?

పార్టీలోకి రావడానికి ఇష్టపడేవారి కోసం తాను ఓ మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీకి తాను నాయకుడిని కానని ఆయన చెప్పారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ నాయకులని, పార్టీలో చేరాలని అనుకునేవారు నేరుగా వారితో మాట్లాడుకోవచ్చునని, తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే సీనియర్లతో మాట్లాడుకోవాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్ పార్టీని వీడి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కాంగ్రెస్ నేతలు సంప్రదిస్తున్నారు. తిరిగి పార్టీలోకి రావాలని వారు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజోగాల్ రెడ్డి కూడా ధ్రువీకరించారు. అయితే, తాను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని పనిచేయబోనని చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కూడా రేవంత్ రెడ్డి ఆ పిలుపు ఇచ్చారని అనుకోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా ఖర్గేతోనో, సోనియా గాంధీతోనో మాట్లాడుకోవాలని ఆయన సూచించినట్లుగా భావించారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తెలంగాణ కాంగ్రెస్ కు ఊపునిచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై తన శక్తిని ఉపయోగించే అవకాశాలున్నాయి. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 136 సీట్లను గెలుచుకుని తిరుగులేని మెజారిటీని సాధించింది. ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఏకమయ్యారు. విభేదాలు విస్మరించి పనిచేయాలనే తలంపుతో వారున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ