Telanagna budget 2022 : రేపే తెలంగాణ బడ్జెట్... భారీగా కేటాయింపులకు ఛాన్స్, అంచనాలివే..!!

Siva Kodati |  
Published : Mar 06, 2022, 09:14 PM IST
Telanagna budget 2022 : రేపే తెలంగాణ బడ్జెట్... భారీగా కేటాయింపులకు ఛాన్స్, అంచనాలివే..!!

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ఈసారి బాహుబలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దళితబంధు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీలకు భారీగా కేటాయింపులు వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (telangana assembly budget session) సోమవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం మంత్రి హరీశ్ రావు (harish rao) శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేసీఆర్ సర్కార్ (kcr govt) ఈసారికి ‘బాహుబలి’ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఎలా ఉండనుంది? వివిధ శాఖలు సమర్పించిన భారీ ప్రతిపాదనలకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయా? ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో పాటు నిరుద్యోగ భృతి వంటి పథకాలకూ నిధులు కేటాయిస్తారా? అన్న అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

2022-23 ఆర్థిక సంవత్సరానికి (telangana budget 2022) గాను సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించి పలు శాఖలు భారీగా నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. అయితే ఖజానాకు రాబడులు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని సమాచారం. పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటాల ద్వారా ఆశించినంతగా ఆదాయం రాకపోయినా.. ఊరటనిచ్చే స్థాయిలో మాత్రం ప్రభుత్వానిక నిధులు చేతికందుతున్నాయి. 

అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం పెద్దగా గ్రాంట్స్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి భూముల అమ్మకం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. దీని ద్వారానే పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ వున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ అని, తర్వాత ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ... బడ్జెట్‌‌ని రూ.2.60 లక్షల కోట్ల నుంచి రూ.2.70 లక్షల కోట్ల మధ్యలో ఖరారు చేసి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ సర్కార్.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన వుంటే మాత్రం, దానికి అనుగుణంగా ఈసారి బడ్జెట్లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దళితబంధు (dalitha bandhu ) కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అదే స్థాయిలో కేటాయింపులు వుండొచ్చని భావిస్తున్నారు. ఇకపోతే నిరుద్యోగులు, విద్యార్ధి వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు గాను నిరుద్యోగ భృతికి కూడా నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. కనీసం 10 లక్షల మంది నిరుద్యోగులకు ఈ పథకం వర్తింపజేసినా.. రూ.2500-3000 కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. ‘మన ఊరు-మన బడి’ పథకానికి రూ.3000 కోట్లు కేటాయిస్తారని అంచనాలు వేస్తున్నారు. 

అలాగే వృద్ధాప్య పింఛను అర్హత వయసును ప్రభుత్వం 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. దీంతో లబ్ధిదారులు మరో 7 లక్షల వరకు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆ అంశానికి అదనంగా నిధులను కేటాయించాల్సి వుంటుంది. ప్రస్తుత సంవత్సరంలో ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లను కేటాయించింది. ఇక వ్యవసాయ రంగానికి వస్తే..  రైతు రుణ మాఫీ (farmer loan waiver) కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.37 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. రూ.లక్ష లోపు రుణాల మాఫీని అమలు చేయాలంటే దీనికీ అదనపు నిధులు అవసరం. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ సర్కార్ రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఈ జనవరి నాటికి రూ.1,37,190.44 కోట్లను వ్యయం చేసింది. అయితే ఈ నెలాఖరుకు అన్ని రకాల వ్యయాల మొత్తం రూ.1.80 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారీ బడ్జెట్‌పై కసరత్తు చేసి వుండొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇకపోతే.. 2022-23 వార్షిక బడ్జెట్‌కు తెలంగాణ మంత్రిమండలి (telangana cabinet) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌కు (budget) ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి రాష్ట్ర ప్రభు‌త్వా‌నికి ప్రతి‌పా‌ద‌నలు వెళ్లిన విషయం తెలి‌సిందే. శాస‌న‌సభ సమా‌వే‌శాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్‌ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమా‌ధా‌నాలు, ప్రభుత్వ ప్రాధా‌న్యాలు, ప్రజల అవ‌స‌రాలు తది‌తర అంశా‌లపై మంత్రి‌వర్గ సమా‌వే‌శంలో చ‌ర్చించారు. అనంతరం మంత్రిమండలి భేటీ ముగిసింది. రేపు మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి