
తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీష్ రావు చేసిన ప్రసంగం.. బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్‌ను ప్రతిబించించేలా ఉంది. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ వ్యతిరేక పోరాటానికి సిద్దమవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ బడ్జెట్‌లో ప్రస్తావించిన అంశాలు.. తెలంగాణ మోడల్ అభివృద్ది అంటే ఏమిటో తెలిపేలా ఉన్నాయి. గతంలో ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. తరుచూ గుజరాత్ మోడల్ డెవలప్‌మెంట్ అంటూ ప్రస్తావించారు. అభివృద్దిలో దేశంలోనే గుజరాత్ నెంబర్ వన్ ఉందని చెప్పేవారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా జనాల్లోకి వెళ్లిన మోదీ.. పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించేవారు. దేశాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తాననే నమ్మకం కలిగించేలా.. గుజరాత్ అభివృద్దిని ప్రస్తావించేవారు.
ప్రస్తుతం బీజేపీ విధానాలపై పోరాడుతున్న కేసీఆర్.. కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు సంక్షేమం, అభివృద్ది అంటే ఏమిటో తెలంగాణ చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు, అభివృద్దిపై పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణను బాగు చేసుకున్నట్టే.. దేశాన్ని కూడా బాగు చేసుకోవాలని చెబుతున్నారు. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా పలు సభలలో తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నారు.
తాజాగా తెలంగాణ 2022-23 వార్షిక బడ్జెట్ ద్వారా.. నేరుగా కేంద్రాన్ని కేసీఆర్ టార్గెట్ చేశారు. కేంద్రం నుంచి సాయం అందకున్న తెలంగాణను అభివృద్దిలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో ఏ విధమైన వృద్ది సాధించిందో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. అభివృద్దిలోనే కాకుండా.. సంక్షేమ పథకాలను బడుగు, బలహీన వర్గాలకు అందజేస్తున్నట్టుగా తెలిపారు. సామాన్యులకు మేలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. బడా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే బడ్జెట్ తమది కాదని.. బడుగుల జీవితాలను మార్చే కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని పేర్కొన్నారు. సమ్మిళిత, సుస్థిర అభివృద్ది సాధిస్తున్నట్టుగా చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు.. ఉన్న సంక్షోభాలను ఏ విధంగా అధిగమించామనేదానిని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. 24 గంటల విద్యుత్, సాగు నీరు అందించడంలో సాధించిన విజయాలు, ఇంటింటికి తాగు నీరు, వ్యవసాయం రంగంలో సాధించిన ప్రగతి (పంటలకు సరిగా నీరందని పరిస్థితి నుంచి దేశానికే అన్నపూర్ణగా మారిన విధానం), రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు, వృద్దులకు, వికలాంగులకు పెన్షన్లు, ఐటీ రంగంలో సాధించిన వృద్ది.. ఇలా బంగారు తెలంగాణ వైపు బాటలు వేస్తున్నామనేలా బడ్జెట్ ప్రసంగం సాగింది.
సంక్షేమ పథకాలు..
తెలంగాణ రైతులకు పంట ప్రోత్సాహకంగా రెండు పంటలకు ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున రైతు బంధు అందిస్తున్నారు. రైతు బీమాను తీసుకొచ్చింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా సాగు, తాగు నీటి ఫలాలను ప్రజలకు అందివ్వడం. పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం. తల్లులకు కేసీఆర్ కిట్లను అందజేయడం. ఆసరా పెన్షన్ల ద్వారా వృద్దుల ఆత్మగౌరవం పెంచడం. దళిత బంధు పథకం తీసుకురావడం ద్వారా.. దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా దళితుల సమగ్ర అభివృద్ది కోసం కృషి చేస్తున్నామనే సంకేతం పంపడం.
రైతుల విషయంలో..
రైతులు విషయంలో తెలంగాణ సాధించిన ప్రగతిని, ఇందుకోసం తెలంగాణ సర్కార్ చేసిన కృషిని వివరించారు. 24 గంటల విద్యుత్, ప్రాజెక్ట్‌లపై ఖర్చు చేసిన మొత్తం.. అసాధ్యమని అనుకున్నవాటిని ఎలా సుసాధ్యం చేశామో వివరంగా తెలియజేశారు. భూగర్భ జలాలు ఏ విధంగా పెరిగాయనేది ప్రధానంగా ప్రస్తావించారు. రైతులకు రైతు బంధు కింద పంట సాయం ఎకరానికి రూ. 5 వేలు అందజేయడం, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా కింద సాయం అందించడం.. తెలంగాణ పంటల విస్తీర్ణం పెరిగిన విధానం, దేశానికి అన్నపూర్ణగా మారింది.
సాగు చట్టాల రద్దుకు ఢిల్లీ రైతుల చేసిన పోరాటం చేస్తే.. తెలంగాణ రైతులు సంక్షేమం కోసం ఎలాంటి కృషి చేశామనే సంకేతాన్ని పంపడం. రైతులకు ఏ రాష్ట్రం చేయని విధంగా తాము ఏ విధంగా అండగా నిలిచామో దేశానికి చెప్పడం. ఇక, రైతు సంఘం నాయకుడైన రాకేష్ టికాయత్‌తో కేసీఆర్ ఢిల్లీలో జరిపన చర్చలు కూడా.. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఏ విధంగా పాటుపడుతుందనేది జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది.
అంకెల్లో మెరుగ్గా..
కేవలం సంక్షేమ పథకాల్లోనే కాకుండా.. అభివృద్ది గణంకాల్లో కూడా తెలంగాణ ముందుకు దూసుకుపోతుందని స్పష్టం చేశారు. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 4,51,580 కోట్లు కాగా.. అది 2021-22 నాటికి రూ. 11,54,860 కోట్లుకు చేరిందన్నారు. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ది రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. 2014-15లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.06 శాతంగా ఉంటే.. 2021-22 నాటికి 4.97 శాతానికి చేరింది. ఏడేళ్లలో జీడీపీకి ఒక శాతం అదనపు వాటా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 2021-22 నాటి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,78,833కు చేరింది. జాతీయ సగటలు ఆదాయం రూ. 1,49,848 కంటే ఇది 86 శాతంగా ఉంది. ఇలా అభివృద్దిలో ఏ విధంగా దూసుకుపోతుందో వివరించారు.
బ్రాండ్ హైదరాబాద్.. బ్రాండ్ తెలంగాణ
తెలంగాణ కొంతకాలంగా ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలకు కీలక కేంద్రంగా ఉద్భవించింది. మరోవైపు స్టార్టప్‌లకు సెంటర్ పాయింట్‌గా నిలిచింది. ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలో హైదరాబాద్‌లో కార్యాలయాలను కలిగి ఉన్నాయి. గతంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమను ఇప్పుడు ప్రభుత్వం నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది, తద్వారా ఇలాంటి అనేక ఐటీ హబ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి.
పెద్ద సంఖ్యలో పరిశోధన సంస్థలు, ఫార్మా పరిశ్రమకు కూడా హైదరాబాద్ కేరాఫ్‌గా నిలిచింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ కరోనా పోరులో కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ దేశీయంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో కీర్తి పొందింది. ఇప్పటికే ఉన్న ఫార్మా సంస్థలు అభివృద్దితో పాటు.. హైదరాబాద్‌లో మరింతగా ఫార్మా రంగం అభివృద్ది చెందేలా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుంది.
అలాగే హరిత హారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి.. కార్యక్రమాల ద్వారా తెలంగాణలో స్వచ్చతతో పాటు, పచ్చదనాన్ని పెంపొందిస్తుంది. ఇలా ప్రతి దానిలో గ్లోబల్ స్థాయిలో ప్రగతి సాధించడానికి తెలంగాణ అడుగులు వేస్తుంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ ఇమేజ్‌ను మరింతగా పెంచుతుండటంతో ఆ పేరు వినిపించినప్పుడల్లా.. కేసీఆర్ సర్కార్ గుర్తొచ్చేలా చేస్తుంది.
అసెంబ్లీ ఎన్నికలు ముందు ఇదే చివరి పూర్థి స్థాయి బడ్జెట్..!
తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అని చెప్పాలి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన అది పూర్తి స్థాయి బడ్జెట్‌గా ఉండే అవకాశం లేదు. అయితే మరోవైపు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎలా చూసినా ఇదే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్థి స్థాయి బడ్జెట్‌గా కనిపిస్తుంది.