మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... వారి జీవితాలపై దెబ్బే..: ఆర్ఎస్ ప్రవీణ్

By Arun Kumar P  |  First Published Dec 11, 2023, 11:14 AM IST

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణవ్యాప్తంగా మహిళలకు ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు రోడ్డునపడే పరిస్థితి వస్తుందని బిఎస్పి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీ కాంగ్రెస్ గెలుపుకు ఎంతగానో ఉపయోగపడింది. దీంతో అధికారంలోకి వచ్చింది మొదలు ఈ గ్యారంటీ హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయ్యింది. తము గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఒక్కోటిగా గ్యారంటీ హామీలను నెరవేరుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే మొదట ఈ గ్యారంటీ హామీ ఫైలుపైనే రేవంత్ రెడ్డి మొదటిసంతకం చేసారు. ఇక ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజున(డిసెంబర్ 9) 'మహాలక్ష్మి' పేరిట ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ప్రారంభించింది రేవంత్ సర్కార్. 

అయితే తెలంగాణ ప్రభుత్వం ఉచితంగానే బస్సుప్రయాణ సౌకర్యం కల్పించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టిసి బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలు ఆర్టిసి బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఇలా రేవంత్ సర్కార్ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంటే కొందరు జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే ఆందోళనను తెలంగాణ బిఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వ్యక్తం చేసారు.  

Latest Videos

గతంలో కార్మికుల సమ్మె, కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ ఆర్టిసి తీవ్రంగా నష్టపోయిన విషయం  తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ నష్టాల్లోంచి బయటకు వస్తున్న ఆర్టిసిపై మహాలక్ష్మి పథకం పెనుభారం మోపనుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టిసి ఆదాయం గణనీయంగా పడిపోతుంది... దీంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రభుత్వ ఉచిత హామీ ప్రభావం ప్రత్యక్షంగా 50 వేలకు పైగా ఆర్టిసి కార్మికులు జీవితాలపై పడుతుందని ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేసారు.  

Also Read  Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?

ఇక మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు, ఇతర వాహనాలు నడిపేవారు కూడా ఆదాయం కోల్పోనున్నారు. అందరూ ఆర్టిసి బస్సుల్లో వెళితే తమకు గిరాకీలు వుండవని... ఎక్కడ రోడ్డున పడతామేనని ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు ఇప్పటికే ఆందోళనకు గురవుతున్నారు. ఊళ్లలో పనులు దొరక్కపోవడంతోనే పట్టణాలకు వలస వచ్చి ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తుంటారని అన్నారు.  కొందరికి సొంత ఆటోలు లేక కిరాయికి తీసుకుని నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారని అన్నారు. అలాంటి ఆటో లక్షలాదిమంది ఆటో డ్రైవర్ల జీవితాలపై ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీ ప్రభావం చూపనుందని ప్రవీణ్ పేర్కొన్నారు.

 ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్ల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కోరారు. ఏదయినా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తూ డ్రైవర్ సోదరులను ఆదుకోవాలని సూచించారు. లేదంటే పొట్టకూటికోసం డ్రైవర్లుగా మారిన పేదల జీవితాలు మరింత దుర్భరంగా మారవచ్చని ఆర్ఎస్ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేసారు. 

ఇక ఇప్పటికే చాలా గ్రామాలకు ఆర్టిసి బస్సులు నడపడం లేదు... తెలంగాణ వచ్చాక అనేక కారణాలతో బంద్ పెట్టారని బిఎస్పీ నేత గుర్తుచేసారు. ఇప్పుడు ఆ సర్వీసులను కూడా పునరుద్దరిస్తారా? అని ప్రశ్నించారు. పేదవర్గాలు అధికంగా వుండే గ్రామాలకు బస్సులు నడపాలని... అప్పుడే మహాలక్ష్మి పథకానికి పూర్తి సార్ధకత దక్కుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 


  

click me!