తెలంగాణ బోనాల పండగ షురూ.. చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళికి తొలి బోనం..

Published : Jun 23, 2023, 04:06 PM IST
తెలంగాణ బోనాల పండగ షురూ.. చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళికి తొలి బోనం..

సారాంశం

Hyderabad: తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు కోలాహ‌లంగా మ‌ధ్య ప్రారంభమయ్యాయి. గురువారం జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలు గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయి. ఈ వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు.  

Telangana-Golconda Bonalu: ఆషాడ బోనాల ఉత్సవాలు హైద‌రాబాద్ లో ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. గొల్కొండ కోటలో గురువారం జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవాలకు ఆలయం, పరిసరాలు సుందరంగా ముస్తాబయ్యాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు కోలాహ‌లంగా మ‌ధ్య ప్రారంభం అయ్యాయి. గురువారం జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలు గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయి. ఈ వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. గోల్కొండ బోనాల సందర్భంగా లంగర్ హౌజ్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో కలిసి మంత్రులు శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. అక్కడి నుంచి జగదాంబిక ఆలయానికి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బోనాలు ఎత్తుకుని మహిళలు, పోతరాజులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా భక్తులు అమ్మవారికి వండిన అన్నం, బెల్లం, పెరుగు, వేప ఆకులతో కూడిన బోనం సమర్పించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాడ మాసంలో మహంకాళి అమ్మవారిని ఊరేగించడంతో బోనాలు ప్రారంభమవుతాయి. భక్తులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన కుండల్లో అమ్మవారికి ఆహారం రూపంలో నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. ఆలయంలో పూజలు కూడా చేశారు. ప్రతి ఏటా హైదరాబాద్ లో మూడు దశల్లో ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ బోనాల అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించే లష్కర్ బోనాలు జ‌రుగుతాయి. ఆ త‌ర్వాత లాల్ దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హైదరాబాద్ పాతబస్తీలోని హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో వచ్చే నెలలో బోనాల‌ ఉత్సవాలు ముగుస్తాయి.

150 సంవత్సరాల క్రితం ఒక పెద్ద కలరా వ్యాప్తి తరువాత ఈ పండుగను మొదటిసారిగా జరుపుకున్నారని సాధారణంగా నమ్ముతారు. మహంకాళి కోపమే ఈ మహమ్మారికి కారణమని భావించిన ప్రజలు ఆమెను శాంతింపజేసేందుకు బోనాలు సమర్పించడం ప్రారంభించారు. గురువారం గోల్కొండ బోనాల ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు.కాగా, గోల్కొండ ఆషాడ  బోనాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ... తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే రాష్ట్ర పండుగగా, అన్ని తెలంగాణ వర్గాల సంస్కృతికి ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం బోనాలను నిర్వహిస్తోందన్నారు.

ఉత్సవాల సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనం భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారనీ, బోనాల పండుగ తరతరాలుగా తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక అస్తిత్వానికి చిహ్నంగా మారిందన్నారు. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా మనందరిపై దైవం కరుణ కురిపించడం శుభసూచకమనీ, ప్రజలపై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఆమె ఆశీస్సులు కొనసాగాలని, దేశంలో కూడా అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ దగ్గరకెళ్లి మరీ దండంపెట్టిన రేవంత్.. KTR Reaction | Revanth Respect | Asianet News Telugu
Vaikunta Ekadashi: హిమాయత్‌నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు | Asianet News Telugu