బీజేపీ బీసీ నినాదం.. బీసీల సభకు ప్రధాని మోడీ.. ప్రచారంలోనూ ప్రధానాస్త్రం!

By Mahesh K  |  First Published Nov 2, 2023, 4:21 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ నినాదాన్ని ఎంచుకుని ముందుకు సాగనుంది. ఇది వరకే బీసీ సీఎం హామీ ఇచ్చిన బీజేపీ.. తన అభ్యర్థుల జాబితాలోనూ ఆ కమ్యూనిటీ నేతలకు పెద్ద పీట వేసింది. ఈ నెల 7వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణకు రాబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొని బీసీల గురించి కీలక ఉపన్యాసం చేయబోతున్నారు.
 


హైదరాబాద్: బీజేపీ ఈ ఎన్నికల్లో బీసీ నినాదం తీసుకుంది. రాష్ట్రంలో బీసీలను తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. బీజేపీ.. బీసీల పార్టీ అనే అభిప్రాయాన్ని తీసుకెళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నది. బీజేపీ ప్రకటిస్తున్న అభ్యర్థుల జాబితాలో బీసీలకు పెద్ద పీటు వేస్తూ వస్తున్నది. 52 మంది అభ్యర్థులతో విడుదల చేసిన బీజేపీ తొలి జాబితాలో 20 మంది బీసీ నేతలకు టికెట్ ఇచ్చింది. తాజాగా 35 మందితో విడుదల చేసిన మూడో జాబితాలోనూ 13 మంది బీసీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు ఒక్కడి పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో బీసీలు 33 మంది ఉన్నారు(కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆడంబరంగా ఆమోదించిన బీజేపీ ఇప్పటి వరకు కేవలం 13 మంది మహిళలకే టికెట్లు కేటాయించడం గమనార్హం). అంతేకాదు, సూర్యపేట సభలో కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని అమిత్ షా ప్రకటించారు.

Latest Videos

Also Read: కర్ణాటక బీజేపీలో తీవ్ర అసంతృప్తి, అధిష్టానానికే అల్టిమేటం.. ఏం జరిగిందంటే?

అభ్యర్థుల ప్రకటన, బీసీ సీఎం నిర్ణయాలే కాదు.. ప్రచారంలోనూ బీసీ నినాదాన్ని బీజేపీ ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నట్టు అర్థం అవుతున్నది. తనను తాను బీసీల పార్టీగా బీజేపీ చూపించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో 50 శాతానికిపైగా బీసీల జనాభా ఉన్నది. ఇది వరకే పలుమార్లు బీసీలు గర్జన సభలు నిర్వహించి దామాషా పద్ధతిలో తమకు రావాల్సిన వాటా రాజకీయ రంగంలోనూ దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు అదే స్థాయిలో టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7వ తేదీన తెలంగాణకు వచ్చి బీసీల సభలో పాల్గొనబోతున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై ఆ కమ్యూనిటీకి భరోసా ఇచ్చేలా ప్రసంగించబోతున్నట్టు సమాచారం. స్వయంగా బీసీ అయిన ప్రధాని మోడీ ఆ సభలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయబోతున్నట్టు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దీంతో అందరి ఆలోచనలు ఈ సభ చుట్టూ తిరుగుతున్నాయి. దీనికితోడు 11న మరోసారి ఆయన తెలంగాణకు వచ్చి ఎస్సీలు నిర్వహించే ఓ సభకు హాజరవుతారని, ఎస్సీ వర్గీకరణపై కీలక హామీ ఇచ్చే అవకాశాలూ ఉన్నాయని కొన్ని వర్గాలు తెలిపాయి.

Also Read: 52 మందితో బీజేపీ తొలి జాబితా: రెండు చోట్ల ఈటల పోటీ

బీజేపీ బీసీ సీఎం హామీ ప్రకటించగానే ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ కామెంట్లు చేశాయి. కులం కాదు, గుణం కావాలని బీఆర్ఎస్ పేర్కొనడం, 2 శాతం వచ్చే ఓట్లతో బీసీని సీఎం చేస్తారా? అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.

click me!