రాష్ట్రాల హక్కుల కాదు.. కేసీఆర్‌, జగన్‌లకు రాజకీయాలే ముఖ్యం: జల వివాదంపై కేంద్రానికి బండి సంజయ్ లేఖ

By Siva KodatiFirst Published Jul 3, 2021, 11:04 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. కృష్ణా రివర్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని ఆయన కోరారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. కృష్ణా రివర్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని ఆయన కోరారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడాలంటే కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని సంజయ్ కుమార్ మండిపడ్డారు. 

Also Read:విద్యుత్ ఉత్పత్తి ఆగదు.. ప్రాజెక్ట్‌ల వద్దకు ఎవరినీ అనుమతించొద్దు: అధికారులకు కేసీఆర్ హుకుం

ఇద్దరికి రాష్ట్రాల హక్కులను కాపాడాలని లేదని.. ఇద్దరు సీఎంలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు... కేసీఆరే అవకాశం ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే... 2వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ను కూడా వాయిదా వేయించారని బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుల పరిధి ఇంకా నోటిఫై కాలేదని బండి సంజయ్ లేఖలో తెలిపారు.

click me!