స్కూళ్లు మూసి క్లబ్బులు తెరిచారు: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ‌పై రాములమ్మ సెటైర్లు

By Siva KodatiFirst Published Apr 20, 2021, 2:56 PM IST
Highlights

కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూపై స్పందించారు బీజేపీ నేత విజయశాంతి. ఈ సందర్భంగా సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాములమ్మ. విద్యాసంస్థలను మూసి క్లబ్బులు, పబ్బులు తెరిచారంటూ ఆమె సెటైర్లు వేశారు

కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూపై స్పందించారు బీజేపీ నేత విజయశాంతి. ఈ సందర్భంగా సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాములమ్మ. విద్యాసంస్థలను మూసి క్లబ్బులు, పబ్బులు తెరిచారంటూ ఆమె సెటైర్లు వేశారు.

అలాగే ర్యాలీలు, సభలు, మందు షాపులకు సైతం అనుమతి ఇచ్చారని రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని ఆమె మండిపడ్డారు. పగటి పూట కరోనాకు ఎలాంటి నియంత్రణ లేదని విజయశాంతి ధ్వజమెత్తారు. 

కాగా, తెలంగాణ రాష్ట్రంలో  రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐటీ, ఈ కామర్స్ వస్తువుల పంపిణీ, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విభాగాలు, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజేస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభించింది.

గర్భిణీలు, రోగులు మెడికల్ సేవలు పొందవచ్చు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని ప్రభుత్వం ప్రకటించింది.నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

అంతరాష్ట్ర, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు నిత్యావసర, అత్యవసర , ఇతర సరుకుల రవాణా కోసం ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల తర్వాత ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 

click me!