భర్తను ఓ జిల్లాకు.. భార్యను మరో జిల్లాకు, ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు: కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్

By Siva KodatiFirst Published Jan 18, 2022, 3:45 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ (bjp) నేత విజయశాంతి (vijayasanthi). నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆప్షన్ ప్రకారం (options) బదిలీ చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ (bjp) నేత విజయశాంతి (vijayasanthi). నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆప్షన్ ప్రకారం (options) బదిలీ చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో నెం.317 (go no 317) అనే పంజాకు చిక్కుకుని విలవిల్లాడుతున్నారని రాములమ్మ అన్నారు.

బదిలీల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెట్టుకున్న ఆప్షన్లు, ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టానుసారం బదిలీలు చేపడుతోందని ఆమె ఆరోపించారు. ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడమే కాకుండా, భర్తను ఓ జిల్లాకు, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఆటలు ఆడుతోందని విజయశాంతి మండిపడ్డారు. దీనిపై ఏంచేయాలో తెలియని ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రగతిభవన్‌ను ముట్టడిస్తే పోలీసులు లాఠీలకు పనిచెబుతూ వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విజయశాంతి వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వ అనాలోచిత తీరుతో ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌లో మార్పులేదని, ప్రాణాలు పోతే పోనీ బదిలీలు మాత్రం ఆగరాదంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను అష్టకష్టాల పాల్జేస్తూ వారి ఉసురు తీస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలు అంతమొందించడం ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు.

click me!