వచ్చేది మా ప్రభుత్వమే.. ఏ పోలీస్ అధికారిని వదలేది లేదు : బీజేపీ నేత రామచందర్ రావు

By Siva KodatiFirst Published Aug 26, 2022, 5:52 PM IST
Highlights

పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ నేత రామచందర్ రావు. వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు హద్దు మీరిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

తాము సభలు, సమావేశాలు పెట్టకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు బీజేపీ నేత రామచందర్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను బయటకు రానీయకుండా చేసే ఆలోచన టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఇప్పటి వరకు తాము ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ సక్సెస్ అయ్యిందని రామచందర్ రావు అన్నారు. వెయ్యి కిలోమీటర్లు తిరిగిన తర్వాత, 100 రోజులు పూర్తయిన తర్వాత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ఇప్పుడు అనుమతి లేదని చెప్పడం వెనుక టీఆర్ఎస్ ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. సంజయ్ యాత్ర వల్ల కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలకు తెలుస్తాయన్న భయమా అంటూ రామచందర్ రావు దుయ్యబట్టారు.

బండి సంజయ్ పాదయాత్ర వల్ల ఎక్కడైనా చిన్న గొడవ జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మమ్మల్ని కోర్టుకు వెళ్లేలా చేస్తున్నారని రామచందర్ రావు మండిపడ్డారు. మునుగోడులో అమిత్ షా సభకు వెళ్లనీయకుండా బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. మీడియా వ్యాన్లను, ప్రతినిధులను కూడా అడ్డుకున్నారని రామచందర్ రావు అన్నారు. అమిత్ షా, జేపీ నడ్డాల మీటింగ్‌లకు భయపడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యానికి తాము రూ.5 లక్షల రుసుము చెల్లించామని, పర్మిషన్ కూడా ఇచ్చారని, అన్ని ఏర్పాట్లు మొదలైన తర్వాత ... 31 వరకు సభలు, సమావేశాలు పెట్టకూడదంటూ పోలీసులు ఆదేశాలు ఇచ్చారని రామచందర్ రావు మండిపడ్డారు. 

Also REad:వరంగల్ లో రేపు బీజేపీ సభ: తెలంగాణహైకోర్టు గ్రీన్ సిగ్నల్

పోలీస్ అధికారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి భయపడో లేదంటే మమకారంతోనో వాళ్లు చెప్పినట్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కాళ్లు మొక్కినందుకు కలెక్టర్‌కి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని రామచందర్ రావు దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దు మీరిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బండి సంజయ్ యాత్రకు కోర్టు అనుమతి వచ్చాక.. జేపీ నడ్డా సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రామచందర్ రావు ఆరోపించారు. 

ఇకపోతే.. తన ప్రజా సంగ్రామ యాత్ర జరిగితే సీఎం ఫ్యామిలీపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై చర్చ జరుగుతుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వర్ధన్నపేటలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ని ముందే బుక్ చేసుకున్నామని, దానికి సంబంధించిన డబ్బు కూడా చెల్లించామని, పోలీసుల అనుమతులు కూడా తీసుకున్నామని , 90 శాతం పనులు కూడా పూర్తయ్యాయని బండి సంజయ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సభకి అనుమతులు రద్దు చేశామని చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోలీసులు నలిగిపోతున్నారని.. ఈ విషయంలో వారిని తప్పుబట్టడానికి కూడా లేదని సంజయ్ అన్నారు. గొడవలు జరుగుతున్నాయని కోర్టును నమ్మించేందుకు ఒక తాగుబోతుని పంపించి హంగామా సృష్టించారని ఆయన ఆరోపించారు. 
 

click me!