'పవన్ కల్యాణ్ వల్లే ఓడిపోయాం... ప్రజల్లోనూ చీప్ అయ్యాం': అనుచిత వ్యాఖ్యల దుమారంపై కిషన్ రెడ్డి క్లారిటీ 

By Arun Kumar PFirst Published Dec 11, 2023, 7:28 AM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని తప్పుచేసామంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు  పెట్టుకున్న జనసేన పార్టీ ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగింది. పోటీచేసిన అన్నిస్థానాల్లోనూ జనసేన ఘోర ఓటమిని చవిచూసింది. బిజెపి కూడా కేవలం 8 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఎక్స్ వేదికన కిషన్ రెడ్డి స్పందించారు. 

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీచేయడం ఒక్కరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదు... ఇరుపార్టీలు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఇప్పటికే ఎన్డిఏ భాగస్వామ్యపక్షంగా జనసేన వుంది కాబట్టే కలిసి బరిలోకి దిగినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

Latest Videos

బిజెపి, జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇరుపార్టీల నాయకులు భావించారు... కానీ అలా జరగలేదు. దీంతో జనసేన వల్లే బిజెపి ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిందని కిషన్ రెడ్డి అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలా ఆదివారం సాయంత్రం నుండి పవన్ కల్యాణ్ పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ప్రచారం జరుగుతోంది. ఇది చివరకు కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన రియాక్ట్ అయ్యారు. 

Also Read  Bandi Sanjay Kumar: అంతా మన మంచికే.. కరీంనగర్ పార్లమెంటు సీటుపై ‘బండి’ ఫోకస్.. ప్లాన్ ఇదే

పవన్ కల్యాణ్ గురించి తానేమీ మాట్లాడలేదని... కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.  ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై ఇవాళ (సోమవారం) పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 

పవన్ గురించి కిషన్ రెడ్డి ఇలా అన్నారంటూ ప్రచారం :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ను నమ్ముకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా నష్టపోయామని కిషన్ రెడ్డి అన్నారట. పవన్ తో కలిసి ప్రచారం చేయడం, ఎన్నికల సభల్లో వేదికను పంచుకోవడమే బిజెపి చేసిన అతిపెద్ద తప్పు... ఇలాచేయడంతో తెలంగాణ ప్రజలు తమను చీప్ గా చూసారని అన్నారట. ఈ విషయం గ్రహించిన బిజెపి అదిష్టానం జనసేనతో పొత్తును ఉపసంహరించుకోవాలని సూచించింది... కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కిషన్ రెడ్డి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  

జనసేనతో కలిసి కాకుండా సొంతంగా పోటీచేసివుంటే హైదరాబాద్ పరిధిలో బిజెపి మరో 4-5 సీట్లు గెలిచేదని కిషన్ రెడ్డి అన్నారట. కనీసం తమ కార్పోరేటర్ల మాటవిన్నా బాగుండేదని... హైదరాబాద్ పై పెట్టుకున్న ఆశలు ఫలించేవని అన్నారట. అసలు ఊహించిన స్థానాల్లో బిజెపి గెలిచింది... కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్రేటర్ పరిధిలో ఓట్లు, సీట్లు సాధించలేకపోయిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

 శేరిలింగంపల్లి, ఖైరతబాద్,  కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, యాకుత్ పురా, ఉప్పల్, రాజేంద్రనగర్ లో బిజెపి గట్టి పోటీ ఇచ్చి బిజెపి గెలుస్తుందని
 భావించారట... కానీ పవన్ తో పొత్తు కారణంగానే ఓడిపోయామని కిషన్ రెడ్డి అన్నారట. హైదరాబాద్ లోని కాపు, కమ్మ సామాజికవర్గం తనతోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మించాడు... అందువల్లే జనసేనతో కలిసి  పోటీచేసామని అన్నారట. ఏదేమైనా బిజెపి ఓటమికి తనదే బాధ్యత అని కిషన్ రెడ్డి అన్నారట. ఇలా పవన్ కల్యాణ్ పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంపై కిషన్ రెడ్డి కొట్టిపారేసారు. 
 

click me!