రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేసుల్లేని మంత్రులు ముగ్గురే ముగ్గురు. మంత్రివర్గంలో అత్యధిక కేసులు పెండింగ్‌లో ఉన్నవి సీఎం రేవంత్ రెడ్డిపైనే. ఆయనపై ఏకంగా 89 కేసులు ఉన్నాయి. సీఎం సహా మొత్తం 9 మంత్రులపై 136 కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 12 మంది అమాత్యులతో కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో మెజార్టీ మంత్రులపై కేసులు ఉన్నాయి. కేవలం ముగ్గురు మంత్రులు మినహాయిస్తే మిగిలిన 9 మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి పై అత్యధికంగా కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
సీఎం సహా 9 మంది మంత్రులపై మొత్తం 136 కేసులు ఉన్నట్టు ఏడీఆర్ ఓ నివేదికలో వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు ఉండగా.. అందులో 50 కేసులు తీవ్రమైన క్రిమినల్ కేసులు. మరో ఐదుగురు మంత్రులు కూడా తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లలో వెల్లడించారు.
ఎవరిపై ఎన్ని కేసులు:
సీఎం రేవంత్ రెడ్డి తర్వాత అత్యధిక కేసులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై 11 కేసులు, పొన్నం ప్రభాకర్ పై 7 కేసులు ఉన్నాయి. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్కలపై 6 చొప్పున కేసులున్నాయి. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖలపై 5 కేసుల చొప్పున, భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావులపై 3 కేసులు నమోదయ్యాయి.
ఈ ముగ్గురిపై కేసుల్లేవ్:
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ముగ్గురిపై కేసులు లేవని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు పేర్కొన్నాయి. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై కేసులు లేవని ఈ సంస్థలు వెల్లడించాయి.