మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాజగోపాల్ రెడ్డి ఒక హీరో లాగా యుద్ధం చేశారని.... ఒక్క బీజేపీ కోసం ఇంత మంది ఏకమయ్యారని ఆయన ఫైరయ్యారు.
ఓటమి ఎదురైనంత మాత్రాన తాము కుంగిపోయేది లేదన్నారు తెలంగాన బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్. మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించినప కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా తీర్పును తాము తప్పుకుండా శిరసా వహిస్తామని ఆయన పేర్కొన్నారు. గెలిచినా, ఓడిపోయినా నిరంతరం ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందని బండి సంజయ్ తెలిపారు. 2018లో బీజేపీ అభ్యర్ధిగా మనోహర్ రెడ్డి పోటీ చేశారని.. అప్పుడు అనుకున్న స్థాయిలో ఓట్లు రానప్పటికి పార్టీని మునుగోడులో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ALso REad:మునుగోడు బైపోల్ 2022: రెండు రౌండ్లు మినహా అన్నింటిలో టీఆర్ఎస్‌దే పైచేయి
బీజేపీ సిద్ధాంతాలు నచ్చి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరారని బండి సంజయ్ అన్నారు. బీజేపీ గెలుపుకోసం ఆయన తీవ్రంగా శ్రమించారని.. ప్రచారం చేసుకోనివ్వకుండా కొందరు గూండాలు అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి హీరోలాగా కొట్లాడారని బండి సంజయ్ ప్రశంసించారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌లతో పాటు బైండోవర్ కేసులు పెట్టారని.. రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా తలొగ్గకుండా కార్యకర్తలు పనిచేశారని బండి సంజయ్ కొనియాడారు.
మునుగోడులో గెలిచిన వెంటనే టీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని.. హామీలు నెరవేర్చుతామని మాత్రం చెప్పడం లేదని సంజయ్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే టీఆర్ఎస్‌లో చేరిన 12 మందితో రాజీనామా చేయించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ గెలుపు తండ్రి గెలుపా..? కొడుకు గెలుపా..? అల్లుడి గెలుపా అని సంజయ్ ప్రశ్నించారు. 11 వేల మెజార్టీతో గెలుపు గెలుపే కాదని.. బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పరోక్షంగా కాంగ్రెస్ కలిసి పనిచేశాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీది ఒక్క పైసా కూడా దొరకలేదని సంజయ్ ధ్వజమెత్తారు. మంత్రుల కాన్వాయ్, అంబులెన్స్‌లు, వ్యాపార సంస్థల గోడౌన్‌ల ద్వారా డబ్బులు పంపారని ఆయన ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ను అడ్డుకునేది ఒక్క బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.