
మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోయింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే వరకు విజయం ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఎర్లీ ట్రెండ్స్‌తోనే తాము ఓడిపోతున్నామని గ్రహించింది. కానీ డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపింది. అయితే మునుగోడులో కాంగ్రెస్ ఘోర ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 2018లో మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఏడాది ఆగస్టులో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై ప్రకటన చేసిన వెంటనే.. మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. మరోవైపు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే.. ఇతర పార్టీల కంటే ముందుగానే.. తమ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే మునుగోడు ఉప ఎన్నిక కోసం కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ ఓట్లను రాబట్టుకోలేకపోయింది.
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలి.. మునుగోడులో ఆ పార్టీ ఓటమికి ముఖ్య కారణాలనే టాక్ వినిపిస్తోంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం భాగంగా ఉన్న భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ ఉపఎన్నికలో ఆ పార్టీ విజయం కోసం పనిచేయలేదని స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చండూరు సభలో అద్దంకి దయాకర్ వాడిన భాష కూడా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కలిగించింది. ఈ కామెంట్స్ సాకుగా చూపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మరోవైపు పార్టీ ప్రచారానికి రాకుండా దూరంగా ఉండిపోయారు. ఆయన బీజేపీ నుంచి బరిలో నిలిచిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి.. అంతర్గతంగా మద్దతు కూడగట్టారనే టాక్ కూడా వినిపించింది. ఇందుకు సంబంధించి ఓ ఆడియో కూడా వైరల్‌గా మారింది. అయితే ఆ ఆడియోను వెంకట్ రెడ్డి బహిరంగంగా ఖండించలేదు. పైగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వెంకట్ రెడ్డి.. మునుగోడు కాంగ్రెస్ గెలవదంటూ చేసిన కామెంట్స్ ఆ పార్టీ శ్రేణుల్లో మరింత నిరాశను నింపాయి.
అలాగే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తరపున కొందరు నాయకులు మాత్రమే ప్రచారానికి వెళ్లారు. కొందరు ముఖ్య నాయకులైతే.. ఒకటి రెండు సార్లు ప్రచారానికి వెళ్లివచ్చి.. మళ్లీ కనీసం అటూ వైపు కూడా చూడలేదు. అయితే కాంగ్రెస్‌లో నెలకొన్న కుమ్ములాటల కారణంగానే ఆ పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. కొందరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా కూడా మునుగోడులో ప్రచారానికి ఆసక్తి చూపలేదనే టాక్ కూడా వినిపించింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రవేశించడంతో చాలా మంది పాదయాత్రలో పాల్గొని.. మునుగోడుకు వెళ్లలేదు.
అయితే పూర్తిగా డబ్బు మాయంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యం పంపిణీలో వెనకబడిందని స్వయంగా ఓటర్లే చెప్పడం చూశాం. ఈ పరిణామాలన్నీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఇబ్బందికరంగా మారాయి. మహిళల్లో ఆమె సానుభూతి సంపాదించుకుంటున్నట్టుగా కనిపించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా మునుగోడులో కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమైంది.
పాల్వాయి స్రవంతికి పడిన ఓట్లు కూడా ఆమె తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డికి ఉన్న ఆదరణ, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదుల నుంచి మాత్రమే వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. మునుగోడులో తమ పార్టీ గట్టి ఓటు బ్యాంకును కలిగి ఉందని భావించిన కాంగ్రెస్ నాయకులకు ఈ ఫలితం భారీ షాక్ అనే చెప్పాలి.
ఇప్పటికే పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికలో ఘోర ఓటమి మరింత దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలోని పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ.. వారికి దిశానిర్దేశం చేసేవారు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా మునుగోడు ఫలితం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. మరి ఈ వరుస ఎదురుదెబ్బలను తట్టుకుని.. తెలంగాణలో కాంగ్రెస్ ఏ మేరకు పటిష్టంగా నిలదొక్కుకుంటుందో అనేది వేచిచూడాల్సిందే.