
తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm) కేసీఆర్‌పై (kcr) విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . సీఎం కేసీఆర్ భాష జుగుప్సాకరంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల (parliament winter session) సందర్భంగా ఢిల్లీ వెళ్లిన ఆయన మంగళవారం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి కేసీఆర్ ప్రెస్‌మీట్‌పై స్పందించారు.
సీఎం వాడే భాష తెలంగాణలో ఎవరైనా మాట్లాడతారా? ఎవరిని ఎలా తిట్టాలనే విషయంపైనే మంత్రివర్గంలో (cabinet meeting) చర్చించారా? కేంద్ర మంత్రి విషయంలో అలాంటి భాష వాడవచ్చా? మీకు భయపడే మీ మంత్రులు ఆ భాషను సమర్థిస్తున్నారేమో కానీ ప్రజలు సహించరని సంజయ్ దుయ్యబట్టారు. బీజేపీ నేతల సహనాన్ని పరీక్షించవద్దని... కేంద్రం రా రైసు కొంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు. రా రైసు కూడా కొనేది లేదని సీఎం చెప్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే మేం ఊరుకునేది లేదని సంజయ్ హెచ్చరించారు.
ధాన్యం మొత్తం తానే కొంటున్నట్లు ఇన్నాళ్లు కేసీఆర్ గొప్పగా చెప్పుకోలేదా అని ఆయన మండిపడ్డారు. వానాకాలం ధాన్యం కొంటామంటున్న కేసీఆర్.. యాసంగిలో ఎందుకు కొనరు?ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చిందని సంజయ్ నిలదీశారు. రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. పాతబియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALso Read:ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలా మూస్తారో చూస్తాం: కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
రైతు మిల్లర్ల మోసాలు బయటపడుతున్నందుకే ధర్నాలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. రైతులకు అండగా ఉండాల్సిన సీఎం.. రైసు మిల్లర్లకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు. సన్న వడ్లలోనూ 5రకాల విత్తనాలు ఉన్నాయని.. వాటిని వేస్తే మంచి దిగుబడి వస్తుందని బండి సంజయ్ చెప్పారు. మంచి విత్తనాలు అందిస్తే రైతులకు సమస్య ఉండదని... సీఎం కేసీఆర్‌కు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై ప్రేమ పెరిగిపోయింది అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.
దళిత బంధు పథకం (dalitha bandhu ) అమలు చేసేందుకు నిధుల్లేక సమస్యను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ఈ డ్రామా ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఎందుకు గొడవ చేస్తున్నరో వారికే అర్ధం కావడం లేదని సంజయ్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో తమకు సంబంధం లేదని.. అది రైతు ద్రోహి ప్రభుత్వమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలో ఎక్కడా లేని సమస్య ఇక్కడే ఎందుకొస్తోందని సంజయ్ ప్రశ్నించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కంటే యూపీ, బెంగాల్, ఏపీ, ఓడిశా రాష్ట్రాలు అగ్రగామిగా వున్నాయని.. తెలంగాణ 6వ స్థానంలో ఉంది కదా...అక్కడ లేని సమస్య ఇక్కడెందుకని ఆయన నిలదీశారు.
నీకొడుకు నిర్వాకంవల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని... నీవల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. నీ కంటే హంతకుడు ఈ దేశంలోనే ఎవరూ లేరని... మత విద్వేషాలు దేశంలో ఎక్కడ జరిగాయని ఆయన ప్రశ్నించారు. నిజమైన మత విద్వేషాలు తెలంగాణలో జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. బైంసాలో మత విద్వేషాలకు కేసీఆరే కారకుడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.