
సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో రేషన్ డీలర్లు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దీంతో రేషన్ అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ల సమ్మెపై స్పందించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవాంర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందన్నారు. ఏళ్లుగా వారి సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఈ పరిస్ధితి తలెత్తిందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మే 22నే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ.. ఒక్క జీవో కూడా విడుదల చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోవడం వల్లే రేషన్ డీలర్లు సమ్మె చేయాల్సి వచ్చిందని బండి సంజయ్ అన్నారు.
మోడీ ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా.. వాటిని కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అందించలేకపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ రేషన్ డీలర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారని సంజయ్ గుర్తుచేశారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌లో సగానికి పైగా కేంద్రమే చెల్లిస్తోందని.. ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కమీషన్ సొమ్మును రాష్ట్రానికి విడుదల చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. అయినప్పటికీ ఆ సొమ్మును డీలర్లకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా రేషన్ డీలర్ల సమ్మెను పరిష్కరించాలని సంజయ్ డిమాండ్ చేశారు.