టెకీలనే బురిడీకొట్టించిన సైబర్ కేటుగాళ్లు... అధిక లాభాలంటూ లక్షల స్వాహా

By Arun Kumar PFirst Published Jun 6, 2023, 1:31 PM IST
Highlights

సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి హైదారబాద్ కు చెందిన ఇద్దరు సాప్ట్ వేర్ ఇంజనీర్లు లక్షల రూపాయలు మోసపోయారు. 

హైదరాబాద్ : ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మరీ ఎక్కువయ్యాయి. అమాయకులను మాయమాటలతో నమ్మించి బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించి మోసగించేవారు కొందరైతే... తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి మోసగించేవారు మరికొందరు. ఇలా చదువుకున్నోళ్లు, చదువురానివారు అని తేడా లేదు... ఎవరినైనా బురిడీకొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా అధిక లాభాలు ఆశచూపించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సాప్ట్ వేర్ ఇంజనీర్ల నుండి లక్షలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. మోసపోయిన టెకీలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్ట్ టైమ్ జాబ్ చేసుకుని వేలు సంపాదించవచ్చు అంటూ మొబైల్ కు వచ్చిన మెసేజ్ ను నిజమని నమ్మారు ఇద్దరు సాప్ట్ వేర్ ఇంజనీర్లు. దీంతో వారిని కొంతకాలం మాయమాటలతో నమ్మించి  ఓ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసారు కేటుగాళ్ళు. కొన్ని టాస్క్ లు ఇచ్చి పూర్తిచేయగానే టక్కున వారి అకౌంట్ లో కొంత డబ్బు వేసేవారు. దీంతో ఇద్దరు టెకీలు పూర్తిగా సైబర్ నేరగాళ్లను నమ్మేసారు. 

ఇలా పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాత తమ చీటింగ్ ప్లాన్ ను అమలుచేసింది సైబర్ నేరాల ముఠా. కేవలం పార్ట్ టైమ్ జాబ్ చేయడంద్వారానే కాదు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందవచ్చని ఆశ పుట్టించారు. అప్పటికే సైబర్ నేరగాళ్ల మాయలో వున్న ఇద్దరు టెకీల్లో ఒకరు రూ.15 లక్షలు, మరొకరు రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇలా 27 లక్షల రూపాయలు తాము సూచించిన అకౌంట్ లో వేయగానే ఫోన్లు స్విచ్చాప్ చేసుకున్నారు. 

Read More  ఐఐటీ జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: పోలీసుల అదుపులో కడప విద్యార్ధి

లాభాల మాట అటుంచి పెట్టుబడి డబ్బులు కూడా తిరిగివచ్చే పరిస్థితి లేకపోవడంతో బాధితులిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ లోని చిలకలగూడ, పంజాగుట్ట సైబక్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఈ మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. బాధిత టెకీల నుండి వివరాలు సేకరించిన పోలీసులు నేరగాళ్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు.
 

click me!