కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఒక్క సమీక్ష లేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు

By Siva KodatiFirst Published Apr 28, 2021, 4:00 PM IST
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.  కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదన్న సంజయ్... ముఖ్యమంత్రి వెంటనే ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.   

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారా? వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. రాష్ట్రానికి ఆక్సిజన్, వ్యాక్సిన్ ఎంతకావాలో స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం కొవిడ్ మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించి చూపిస్తోందని సంజయ్ ఆరోపించారు.

Also Read:వచ్చే నాలుగైదు వారాలు అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

ప్రభుత్వం తప్పుడు లెక్కల ప్రకటనల వల్లే ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. కొవిడ్‌ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని.. పీఎం కేర్‌ నిధుల గురించి పూర్తి నివేదిక ఇచ్చామని బండి సంజయ్ గుర్తుచేశారు.

సీఎం కేర్‌ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ సలహాలు, సూచనలు తీసుకోవాలని సంజయ్ కోరారు. రాష్ట్రంలో కరోనా మరణాలు, పాజిటివ్‌ కేసులకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా కేంద్రానికి నివేదిక ఇస్తే కేంద్రం ఆదుకుంటుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

వరంగల్‌, ఖమ్మంతోపాటు సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం చేశానని.. అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ అవినీతి, అక్రమాలతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. 

click me!