పేపర్ లీక్ .. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందే, కొడుకు తప్పుంది కాబట్టే కేసీఆర్ నోరెత్తడు : బండి సంజయ్

By Siva KodatiFirst Published Apr 1, 2023, 5:43 PM IST
Highlights

పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. టీఆర్ కు సంబంధం వుంది కాబట్టే సీఎం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదన్నారు.
 

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది తెలంగాణలోనేనంటూ దుయ్యబట్టారు. అప్పుల్లో కూరుకున్న రైతుల సంఖ్యలోనూ తెలంగాణనే నెంబర్ వన్ అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. 24 గంటల విద్యుత్ విషయంలో రైతులను కేసీఆర్ మోసం చేశారని.. 24 గంటల విద్యుత్ ఎక్కడిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం సబ్సిడీ వ్యవస్థనే నాశనం చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నీకు ఇబ్బంది ఏంటని సంజయ్ ప్రశ్నించారు. ఇద్దరిదే తప్పు అని కేటీఆర్ అంటున్నారని..  మరి అలాంటప్పుడు సిట్ 15 మందిని ఎందుకు అరెస్ట్ చేసిందని ఆయన నిలదీశారు. ఈ కేసులో ప్రమేయం వున్న బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు చిన్న వాళ్లను అరెస్ట్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. విచారణ పూర్తిగాక ముందే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా మళ్లీ వాళ్లతోనే పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ముందు మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ అన్యాయం అవుతుంటే కేసీఆర్ మాట్లాడరా అని ఆయన ప్రశ్నించారు. 

ALso REad: నిరుద్యోగ భృతి, ఏప్రిల్ ఫూల్స్ డేని లింక్ చేస్తూ.. కేసీఆర్‌పై బండి సంజయ్ సెటైర్లు , ట్వీట్ వైరల్

కేటీఆర్ కు సంబంధం వుంది కాబట్టే సీఎం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదని సంజయ్ ఆరోపించారు. కనీసం కేబినెట్ మీటింగ్ కూడా పెట్టలేదని.. పేపర్ లీక్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని కేటీఆర్ అంటున్నాడని ఆయన దుయ్యబట్టారు. పేపర్ లీక్ వ్యవహారంలో కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదని.. బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ మాదిరే తెలంగాణలోనూ పాలించాలని కేసీఆర్ చూస్తున్నాడని దుయ్యబట్టారు. కొడుకు, బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ యత్నాలు చేస్తున్నారని.. ఉత్తర కొరియా నియంత కిమ్ కి కేసీఆర్ వారసుడని సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి కొందరు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం పర్మినెంట్ కాదని.. దమ్ముంటే పోలీస్ బందోబస్తు లేకుండా పబ్లిక్‌లో తిరగాలని ఆయన సవాల్ విసిరారు. 

click me!