ధరణి పేరుతో దోపిడీ.. కేసీఆర్‌ కోసమే, ఆ నలుగురు కలెక్టర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : బండి సంజయ్

By Siva KodatiFirst Published Feb 8, 2023, 4:50 PM IST
Highlights

నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్‌కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆ నలుగురిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని సంజయ్ తెలిపారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్‌కు ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ వర్క్‌ షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. ధరణి పేరుతో ఆ నలుగురు భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని, వీరి వ్యవహారం త్వరలోనే బయటపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఊడిగం చేస్తున్న సదరు కలెక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. ప్రగతి భవన్‌లో అన్ని పనులు ఆ నలుగురే చక్కబెడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల నిజాయితీతో కష్టపడి పనిచేస్తున్న ఐఏఎస్‌లకు చెడ్డపేరు వస్తోందన్నారు. ఆ నలుగురిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఇంతకీ ఆ నలుగురు కలెక్టర్లు ఎవరు అన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

ఇక .. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇది ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని.. అంతా డొల్ల బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో, పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో చివరి సంవత్సరం కూడా మొండి చేయి చూపారని సంజయ్ ఎద్దేవా చేశారు. దళిత సమాజాన్ని మోసం చేసేలా బడ్జెట్ వుందని, ఈసారి కూడా బీసీ విద్యార్ధులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Also REad: అంతా డొల్లే.. చివరి ఏడాదీ మొండిచేయే, పిల్లలకు మళ్లీ పురుగుల అన్నమే : బడ్జెట్‌పై బండి సంజయ్ విమర్శలు

విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చూస్తుంటే మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు వున్నాయంటున్నారు. డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులు వున్నాయని బండి సంజయ్ విమర్శించారు. రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రూ.1.31 లక్షల కోట్లను ఆదాయంగా చూపిందని, మరి మిగిలిన రూ.1.60 కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పలేదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు, పన్నుల రూపంలో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోందని బండి సంజయ్ గుర్తుచేశారు. బడ్జెట్ అంతా శుష్క వాగ్ధానాలు.. శూన్య హస్తాలే అన్నట్లుగా వుందని ఆయన దుయ్యబట్టారు. 
 

click me!