జాతీయవాద వ్యతిరేకిని చిత్తుగా ఓడించి... మంచి గుణపాఠం చెప్పారు: ప్రకాష్ రాజ్ పై బండి సంజయ్ ఫైర్

By Arun Kumar PFirst Published Oct 11, 2021, 12:43 PM IST
Highlights

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణుకు అభినందనలు తెలిపిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్... ప్రకాష్ రాజ్ ఓడించినందుకు తెలుగు నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు. 

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ల (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల సినీప్రియుల దృష్టికి ఆకర్షించాయి. ఫలితంపై సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారంటే ఎంతలా ప్రభావితం చేసాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో గెలిచి మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న మంచు విష్ణును అభినందిస్తూ ఓటమిపాలైన ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు తెలంగాణ బిజెపి అధ్యక్షులు, ఎంపీ బండి సజయ్ కుమార్. 

"మా" అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది'' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేసారు. 

''తెలుగు మూవీ అసోసియేషన్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. "మా" ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు. భారత్ మాతాకి జై !'' అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. 

అయితే bandi sanjay తనను జాతీయవాద వ్యతిరేకిగా అభివర్ణించడాన్ని prakash raj తప్పుబట్టాడు. నేను జాతీయవాదినే... బండి సంజయ్ లాంటి బాధ్యతాయుత పదవుల్లో వున్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు'' అన్నాడు ప్రకాష్ రాజ్.

read more  ఆయనేం చేయకుండానే రక్కేస్తానా?, ఇంకా చిరు ట్వీట్, మోహన్ బాబు పిలుపు

మా ఎన్నికల ఫలితాల అనంతరం  మొదటిసారి ప్రకాష్ రాజ్ మీడియాముందుకు వచ్చి షాకింగ్ ప్రకటన చేశారు. తెలుగు మూవీ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే టాలీవుడ్ హీరోలతో, దర్శకులతో నిర్మాతలతో తన అనుబంధం కొనసాగుతుందని... ఇకపై తెలుగు సినీ పరిశ్రమలో తాను అతిథిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 

నిన్న ఆదివారం మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. MAA elections లో ఇరు ప్యానెల్ల మధ్య హోరాహోరీ ప్రచారం, మాటల యుద్దం కారణంగా ఎన్నికల ఫలితంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే రాత్రి అధికారికంగా మా ఎన్నికల ఫలితాలు వెలువడగా అధ్యక్షుడిగా మంచు విష్ణు వంద ఓట్లకు పైగా మెజారిటీతో ప్రకాష్ రాజ్ పై గెలుపొందారు. అధ్యక్ష పదవికి ఫోటీచేసిన విష్ణుకు 391 ఓట్లు రాగా ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. 
 
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విషయంలో ఇరు ప్యానల్స్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో నడిచింది. చివరకు కీలకమైన జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులను సైతం మంచు విష్ణు ప్యానెల్ నుండి పోటీ చేసిన రఘుబాబు, శివబాలాజీ దక్కించుకున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిని మంచు విష్ణు ప్యానెల్ కోల్పోయింది. నటుడు బాబు మోహన్ పై ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన శ్రీకాంత్ 125  ఓట్ల భారీ మెజారిటీతో ఆ పదవి దక్కించుకున్నారు. 

click me!