
పేపర్ లీక్ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇందిరాపార్క్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. లీకేజీలు సర్వసాధారణమని ఓ మంత్రి అంటున్నాడని, ఆయనకు నోటీసులు ఇవ్వరా అని సంజయ్ ప్రశ్నించారు. పేపర్ లీకైంది టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో అయితే బీఆర్ఎస్‌కు ఏం సంబంధమని మరొకరు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్ముకున్నోళ్లు తనను మోసం చేశారని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అంటున్నాడని, ఈయనకు , కమీషన్ సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వరని సంజయ్ ప్రశ్నించారు.
టీఎస్‌పీఎస్సీ కమీషన్‌ను ఎందుకు రద్దు చేయరని ఆయన నిలదీశారు. అలా చేస్తే కమీషన్ సభ్యుల అసలు బండారం బయటపడుతుందన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు కమీషన్ సభ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 30 లక్షల మంది భవిష్యత్ ప్రమాదంలో పడితే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏ శాఖలో ఏం జరిగినా ముఖ్యమంత్రి కొడుకే స్పందిస్తాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
ALso REad: టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలి.. ఎమ్మెల్యే ఈటల డిమాండ్..
అంతకుముందు టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మా నౌకరీలు మాగ్గావాలి అంటూ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిర్వహిస్తున్న నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని గుర్తుచేశారు. 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, 1969లో 369 విద్యార్ధుల బలిదానం, 2001 నుంచి మలిదశ ఉద్యమం సాగిందని చెప్పారు. విద్యార్థుల బలిదానం, ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అని తెలంగాణ తొలి అసెంబ్లీలో తానే ప్రకటించానని చెప్పారు. అయితే ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ యువతను మోసం చేశారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో 1700 మందినీ ఒక కలం పోటుతో తీసివేస్తే తానే అడ్డుకున్నాని చెప్పారు. కేసీఆర్ వల్ల ఆర్టీసీలో 39 మంది బలైన విషయం మర్చిపోవద్దని అన్నారు. కేసీఆర్ పాలనలో బాగుపడలేదని.. బ్రతికి చెడ్డామని కామెంట్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం తీసివేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంకా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. చివరికి టీఎస్‌పీఎస్సీని కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారని.. ఇంతకంటే సిగ్గుమాలిన, దుర్మార్గ విధానం లేదని విమర్శించారు.