
గద్వాల్ జిల్లా (gadwal district) అలంపూర్ నుంచి తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ... ఈ దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. పాతబస్తీకి వెళ్లి బీజేపీ మీటింగ్ పెడుతుందా? అని చాలా మంది అడిగారని సంజయ్ తెలిపారు. చార్మినార్ సమావేశానికి అనుమతి ఇవ్వకపోతే పాతబస్తీ మొత్తం మీటింగ్‌లు పెడతానని హెచ్చరించినట్లు ఆయన గుర్తుచేశారు.
జోగులాంబ ఆలయాన్ని చూస్తే బాధ కలిగిందని.. అమ్మవారి దేవాలయాన్ని (alampur jogulamba temple) ఎందుకు అభివృద్ధి చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అమ్మవారు ఏం తప్పు చేసిందని దసరా ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన నిలదీశారు. కేసీఆర్‌కు అమ్మవారంటే భయం లేదు కానీ మజ్లీస్ అంటే భయమంటూ సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులు తిరగతోడి కేసీఆర్ (kcr) సంగతి చూస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. రంజాన్ కోసం కేసీఆర్ ప్రత్యేక జీవోలు ఇచ్చారని... శివమాల, అయ్యప్ప, హనుమాన్ మాల ధరిస్తే బడికి, ఉద్యోగానికి రావద్దన్నారంటూ ఆయన ఫైరయ్యారు.
బీజేపీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛగా పూజలు, భిక్ష తీసుకునే విధంగా జీవో ఇస్తామని బండి సంజయ్ తెలిపారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఎందుకు ఆధునికీకరణ చేయలేదో కేసీఆర్ చెప్పాలని ఆయన నిలదీశారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుంటామని.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఏడేళ్లుగా ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని... ముఖ్యమంత్రి కేసీఆర్ మెడలు వంచి వరి కొంటామని అనిపించిన ఘనత బీజేపీదేనని ఆయన స్పష్టం చేశారు.
మిర్చి పంటకు తెగుళ్లు సోకి రైతులు బాధపడుతుంటే కేసీఆర్ ఆదుకున్నారా అని బండి సంజయ్ నిలదీశారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తే బీజేపీ ఊరుకోదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధును ఎట్టి పరిస్ధితుల్లోనూ కేసీఆర్ ఇవ్వరని బండి సంజయ్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మార్పు రావాలని... ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.