
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం జరిగిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకరో ఇద్దరు చేరినంత మాత్రాన కాంగ్రెస్‌కు సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని సంజయ్ ఆరోపించారు. హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలలో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణలో రామరాజ్య స్థాపనే బీజేపీ లక్ష్యమని.. బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టేది బీజేపీయేనని సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో వాళ్లలో వాళ్లే తన్నుకుంటారని.. ఆ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చురకలంటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మోరుగుతూనే వుంటారని.. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభ కంటే రెట్టింపు స్థాయిలో వరంగల్ సభను విజయవంతం చేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. మోడీ నన్ను శెభాష్ అంటున్నారంటే మిమ్మల్ని అన్నట్లేనని.. వరంగల్‌లో మరోసారి శెభాష్ అనాలని సంజయ్ పేర్కొన్నారు.
ALso Read: మరోసారి బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్: రఘునందన్ రావుకు మద్దతు
మరోవైపు.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి బండి సంజయ్ మారుస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తోసిపుచ్చింది. బండి సంజయ్ ను తప్పిస్తే పార్టీలో చేరికల కంటే పార్టీ నుండి వెళ్లిపోయేవారే ఎక్కువగా ఉంటారని బీజేపీ నేత విజయరామారావు వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా విజయరామారావు ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టు బీజేపీలో కలకలం రేపింది. ఓ జంతువును తన్నుతూ ఆటో ట్రాలీలో ఎక్కించే వీడియోను పోస్టు చేస్తూ బీజేపీ నేతలకు ఈ రకమైన ట్రీట్ మెంట్ కావాలని వ్యాఖ్యానించారు. ఈ పోస్టును బీజేపీ అగ్రనేతలకు ట్యాగ్ చేశారు . అయితే బండి సంజయ్ ను తప్పించాలనే నేతలనుద్దేశించే తాను ఈ పోస్టు పెట్టినట్టుగా జితేందర్ రెడ్డి ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే జితేందర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. వయస్సు, అనుభవం ఉన్న నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.