
తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పాత సెక్రటేరియట్ ఇంకా వందేళ్లు వుండేదని, దానిని ఎందుకు కూల్చారని ఆయన ప్రశ్నించారు. సెక్రటేరియట్‌కు రాని కేసీఆర్ దానిని ఎందుకు కూల్చాల్సి వచ్చిందని బండి సంజయ్ నిలదీశారు. పేదలకు ఉపయోగపడే ఉస్మానియాను ఎందుకు కూల్చి కొత్తది కట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కూలుస్తా అన్నది నువ్వే కేటీఆర్ అంటూ..తాను పాతబస్తీ నుంచే ప్రారంభించమన్నానని బండి సంజయ్ గుర్తుచేశారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు కట్టనిది వాస్తవమేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కోట్ల నష్టం వచ్చిందని రిపోర్ట్‌లే చెప్పాయని.. బానిసత్వ మరకలు చెరిపేయాలని తాము చూస్తున్నామన్నారు. నిజాం మరకలు ఇంకా వుండాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
బడ్జెట్‌పై ఎక్కడా చర్చ లేదని.. సీఎం మాటపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. కేంద్రం, మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లుందని సంజయ్ దుయ్యబట్టారు. పోడు భూముల పట్టాల పంపిణీపై మళ్లీ కొత్త లింకు పెట్టారని.. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. బోయ వాల్మీకీలను ఎందుకు ఎస్టీలలో చేర్చలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున లేనిపోని హామీలు ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఒకాయన సచివాలయాన్ని కూలగొడతానని అంటున్నాడని మండిపడ్డారు. తాము నిర్మాణాలు చేద్దాం, పునాదులు తవ్వాలనుకుంటున్నామని కేటీఆర్ అన్నారు.వాళ్లలో ఒకాయన సమాధులు తవ్వుతామంటున్నారని.. మరొకాయన బాంబులు పెట్టి పేల్చుతామంటున్నారని సెటైర్లు వేశారు. ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దని ఆయన ప్రజలను కోరారు.
ఉదయం సంజయ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం గుమ్మటా లను కూల్చివేస్తామన్నారు. జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా హైద్రాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లి లో 77, 78,79 వార్డులల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను బండి సంజయ్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతి,ని ధ్వంసం చేస్తామన్నారు. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని బండి సంజయ్ చెప్పారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. రోడ్డుకు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కులుస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ దమ్ముంటే పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చాలని సవాల్ విసిరారు.