
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, అగ్నిపథ్ పథకం, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. దేవుళ్లను సీఎం కేసీఆర్ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని... రోజుకో హత్య, అత్యాచారం జరుగుతుంటే ఒక్కర్ని పట్టుకోవడం చేతకాదంటూ సంజయ్ చురకలు వేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
కర్ణాటక సీఎం వరదలు ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తున్నారని.. నువ్వు ప్రగతి భవన్ దాటుతున్నావా అంటూ కేసీఆర్‌పై ఆయన ధ్వజమెత్తారు. మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని.. నువ్వు ఫామ్ హౌస్ దాటి బయటికి రావంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ కు అహంకారం బాగా తలకెక్కిందని.. ఆయన దేశమంతా తిరిగి బ్రాందీలు, బ్రాండ్ల గురించి మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం గురించి కాదు.. నెట్టెంపాడు గురించి మాట్లాడాలని సంజయ్ చురకలు వేశారు.
టీఆర్ఎస్ లో ఏక్‌నాథ్ షిండేలు చాలా మంది వున్నారని.. అందుకే ఆ పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించారని ఆయన దుయ్యబట్టారు. మోడీపై కేసీఆర్ మాటల్ని విని తెలంగాణ సమాజం చీదరించుకుంటోందని సంజయ్ విమర్శించారు. సుప్రీం తీర్పును మాజీ జడ్జిలు విమర్శిస్తే మాకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆరే సుప్రీం తీర్పుల్ని ప్రశ్నించారని బండి సంజయ్ గుర్తుచేశారు. కేసీఆర్ కు దమ్ముంటే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని ఓడించాలని సవాల్ విసిరారు. దేశంలో మత కలహాలు లేకుండా మోడీ కాపాడుతున్నారని.. కేసీఆర్ మనిషి రూపంలో వున్న మృగమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ALso REad:సైన్యంలోనేనా... ప్రభుత్వంలో యువరక్తం వద్దా, ముందు మోడీని తప్పించాలి : అగ్నిపథ్‌పై కేసీఆర్ స్పందన
సీఎం మాటలకు భయపడే పార్టీ బీజేపీ కాదని... కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నాడని, అందుకే ముఖ కవళికల్లో తేడా కన్పిస్తోందన్నారు. నీ అవినీతి సంగతి తెలియదా.. ఎలుగుబంటి సూర్యనారాయణను తీసుకొస్తే అసలు సంగతి బయటపడుతుందని బండి సంజయ్ అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం మాట్లాడుకున్నామో .. ఈ పీకుడుగానికి ఏం తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం వరదలతో మునిగిపోతోందని.. లండన్, న్యూయార్క్, ఇస్తాంబుల్ అన్నావ్ కదా , జనం నిలదీస్తారని తెలిసే దారి మళ్లించే మాటలు మాట్లాడుతున్నవంటూ కేసీఆర్ కు చురకలు వేశారు.
దళితులకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? రుణమాఫీ ఏమైంది? దళితులకు పది లక్షల సంగతేమైంది? ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? నీ పాలనలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నరు? ముందు వీటికి సమాధానం చెప్పాలంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అప్పుడెట్లా వుంది.. ఇప్పుడెట్లా వుందో ప్రజలకు తెలియదా అని ఆయన దుయ్యబట్టారు.
ఆయనో పాస్‌పోర్ట్ బ్రోకర్ అని చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్రను మరిచిపోయాడా అంటూ ఎద్దేవా చేశారు. కాశ్మీర్ ఫైల్స్ ఏందీ.. రజాకార్ ఫైల్స్ సినిమా తీస్తామని, కేసీఆర్ అవినీతి బండారాన్ని బయటకు తీస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. మోడీ నీలాగే మాట తప్పలేదని.. ఆర్టికల్ 370 రద్దు చేశాడని, అయోధ్యలో రామ మందిరం నిర్మించాడని, సీఏఏ అమలు చేశాడని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ చేసిందేమిటీ... ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోవడం లేదని, ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.