లిక్కర్ కేసులో కవితను తప్పించేందుకు కేసీఆర్ స్కెచ్ .. పాలమూరుకొస్తే వలసలు చూపిస్తా : బండి సంజయ్

By Siva KodatiFirst Published Dec 4, 2022, 9:42 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలమూరు సభలో చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మహబూబ్‌నగర్‌లో వలసలు లేవంటున్న కేసీఆర్ తమతో పాటు వస్తే వలసలు చూపిస్తామన్నారు. 

మహబూబ్‌నగర్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీలపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఏడో రోజు నిర్మల్ రూరల్ మండలంలో సాగింది. ఈ సందర్భంగా చిట్యాలలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరు సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలు లేవని చెప్పటం అవాస్తవమని.. తమతో కలిసి పాలమూరులో కేసీఆర్ పర్యటిస్తారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. లిక్కర్ స్కాంలో కవితను తప్పించడానికే కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని.. అందుకే మరో తెలంగాణ తరహా ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో గడీల పాలనను అంతం చేయడానికే బీజేపీ ప్రజల ముందుకు వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు. 

అంతకుముందు ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో వలసలు , ఆత్మహత్యలు, ఆకలి చావులతో పాలమూరులో భయంకరమైన పరిస్ధితులు వుండేవన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ రోజు పాలమూరు అంటే కరువు జిల్లా కాదని పచ్చటి జిల్లా అని సీఎం అన్నారు. కేంద్రం మన నీటి వాటా తేల్చడం లేదని.. 25 లక్షల ఎకరాల్లో పాలమూరులో పచ్చని పంటలు పండే రోజు రాబోతోందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు నిర్మించుకున్నామన్నారు .

Also REad:నీ ప్రభుత్వం కూలుతుందని మోడీనే అన్నారు.. దొంగల్ని పట్టుకుని లోపలేశాం : ఫాంహౌస్‌ కేసుపై కేసీఆర్

కేసీఆర్ నీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రధాని అన్నారని.. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా వుంటుందా అని సీఎం ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారని కేసీఆర్ ఆరోపించారు. విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని.. మొన్న హైదరాబాద్‌కు దొంగలు వచ్చారని , టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే దొరకబట్టి జైల్లో వేశామని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాజకీయాల్లోకి అందరం కలిసిపోదామని.. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి పాటుపడదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దామన్నారు. 
 

click me!