విద్యుత్ చట్టాలపై అమిత్ షాను రైతులు నిలదీయలేదు.. అవన్నీ కేసీఆర్ లీకులే : బండి సంజయ్ క్లారిటీ

By Siva KodatiFirst Published Aug 21, 2022, 4:58 PM IST
Highlights

విద్యుత్ చట్టాలను మార్చాలని రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేవలం సేంద్రీయ వ్యవసాయం గురించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. 

తెలంగాణ పర్యటనలో భాగంగా బేగంపేట్ విమానాశ్రయంలో కొందరు రైతులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ చట్టం, వ్యవసాయ బావులకు మీటర్ల విషయం చర్చకు వచ్చిందని కథనాలు వచ్చాయి. విద్యుత్ చట్టాలను మార్చాలని రైతులు అమిత్ షాను కోరారని.. అయితే విద్యుత్ చట్టాలు కాదు, ప్రభుత్వాన్ని మార్చాలని అమిత్ షా సమాధానమిచ్చారని ప్రచారం జరిగింది. విద్యుత్ చట్టాల అంశంతో అమిత్ షా ఇరుకునపడ్డారని టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. 

అయితే దీనిని ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. జరిగింది ఒకటైతే బయటకు లీక్ చేసింది మరొకటి అన్నారు. లేనిపోని విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిందని.. కొన్ని ఛానెళ్లు వాటినే బ్రేకింగ్‌గా ఇచ్చాయని సంజయ్ ఆరోపించారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని.. లోపల చర్చ జరగని విషయాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సేంద్రీయ వ్యవసాయం గురించే చర్చ జరిగిందని.. మరే విషయం చర్చకు రాలేదని సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుట్రలలో మీడియా భాగం కావొద్దని ఆయన సూచించారు. కేసీఆర్ లీకుల వీరుడని, లీకుల సంఘానికి నాయకుడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతులను ఎప్పుడైనా కలిశారా అని ఆయన ప్రశ్నించారు. 

ALso REad:నాది ఆర్గానిక్ వ్యవసాయమే.. 12 ఆవులు కూడా వున్నాయి: రైతులతో అమిత్ షా

ఇకపోతే.. అమిత్ షా తెలంగాణ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అమిత్ షాకు బేగం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అమిత్ షా అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. 

అనంతరం సికింద్రాబాద్ సాంబమూర్తి నర్‌లో బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి  వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన అమిత్ షాకు సత్య నారాయణ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్, స్థానిక బీజేపీ కార్పొరేటర్ సత్యనారాయణ నివాసంలోనికి వెళ్లారు. సత్యనారాయణ నివాసంలో అమిత్ షా తేనీరు సేవించారు. అలాగే సత్యనారాయణ కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు. ఇక, సత్యనారాయణ దాదాపు 30 ఏళ్లుగా బీజేపీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు. అమిత్ షా తన ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా సత్యనారాయణ చెప్పారు. అమిత్ షా రాకపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

click me!