
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసపెట్టి అగ్రనేతలతో ఆయన సమావేశమవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఆయన పార్టీ పెద్దలను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగానకు రానున్నారు. అలాగే వాయిదాపడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు కూడా రాష్ట్ర పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా తెలంగాణకు తీసుకురావాలని బండి సంజయ్ భావిస్తున్నారు.
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. రాష్ట్రం ఇచ్చిందే మేం.. మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ అధికారం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. కర్ణాటక విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగానే ప్రభావం ఉన్నా.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి దూకుడును చూపించింది. ఇప్పటి వరకు ఉన్న తీరు ఇది. కానీ, ఎన్నికల సంవత్సరంలో చాలా మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయని తెలిసిందే. తెలంగాణలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.
ALso Read: కర్ణాటక ఎఫెక్ట్: టీ కాంగ్రెస్‌లో జోష్.. డీలాపడ్డ బీజేపీ!
ఉప ఎన్నికల ఫలితాలతో అధికార బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడిన బీజేపీ ఇప్పుడు కొంచెం ఢీలా పడ్డట్టు కనిపిస్తున్నది. ఈ దూకుడు మీదే రాష్ట్రంలో తాము ప్రధాన ప్రతిపక్షం అని బీజేపీ చెప్పుకుంది. కానీ, గత కొన్ని రోజులుగా రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్గత పోరుతో బీజేపీలో వర్గాలు ఏర్పడగా.. కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయంతో కాంగ్రెస్ ఊపందుకున్నది.
తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ ఎన్నో ఎత్తులు వేసింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే అన్నట్టుగా ఇక్కడ నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతోనూ ఒక సంకేతం వచ్చింది. కానీ, తెలంగాణ బీజేపీ కొందరు నేతల్లో బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తి నెలకొంది. ఈటెల రాజేందర్ మొదలు ధర్మపురి అర్వింద్ వరకు ఈ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు చేస్తారనే వాదనలు వచ్చినా.. ఎన్నికల ముంగిట్లో ఈ నిర్ణయం సరికాదని మిన్నకుండినట్టు తెలిసింది.