
Bandi Sanjay: రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రక్షణ, రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు గురువారం బహిరంగ లేఖ రాశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది కౌలు రైతులకు భద్రత లేకుండా పోయిందన్నారు. వీరి డిమాండ్ల కోసం.. రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోసం నిరసనలు చేస్తున్నామని సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కొనసాగిస్తున్న పాదయాత్రలో అనేక మంది కౌలు రైతులు తనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ రాసిన బహిరంగ లేఖలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడుత పాదయాత్రలో అనేక మంది రైతులు తనను కలిశారనీ, గత ఏడు రోజులుగా ఏ గ్రామానికి వెళ్లినా వందలాది మంది రైతులు తన వద్దకు వచ్చి రైతు రుణమాఫీ జరగలేదని తమ గోడును వెళ్లబోసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రలోని దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులకు రక్షణ లేకుండా ఉందనీ, దీనిపై ఆయా వర్గాల్లో తీవ్రమైన ఆందోళన ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతుల అందే ప్రయోజనాల్లో కౌలు రైతులకు ఎలాంటి లబ్ది లభించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. వెంటనే రైతు సమస్యలను పరీష్కరించాలని డిమాండ్ చేశారు.
2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లక్ష రూపాయల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తుందని హామీ ఇచ్చింది. అయితే, ఈ నాలుగేండ్లలో ప్రభుత్వం రూ.20,164.20 కోట్లు కేటాయించినట్టు గొప్పలు చెబుతోందని విమర్శించారు. మొత్తం కేటాయింపుల్లో కేవలం 1.144.38 కోట్లు మాత్రమే విడుదల చేసిందని పేర్కొన్నారు. దీని వల్ల 5.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగగా దాదాపు 31 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. 25 వేల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 2.96 లక్షల మంది ఉండగా, వారికి రుణమాఫీ కావాల్సింది రూ.408.30 కోట్లని తెలిపారు. అలాగే, 25 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల లోపు రుణమాపీ కావాల్సిన రైతులు 5.72 లక్షల మంది ఉండగా, వారి రుణాలు 1,790 కోట్ల రూపాయలని పేర్కొన్నారు.
అలాగే, రూ.50 వేల నుంచి 75 వేల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 7 లక్షల మంది ఉండగా, వారికి రుణమాఫీ కావాల్సింది రూ.4 వేల కోట్లు అని తెలిపారు. ఇక 75 వేల నుంచి లక్షవరకు రుణమాపీ కావాల్సిన రైతులు 21 లక్షల మంది ఉండగా, వారికి రుణమాఫీ కావాల్సింది 13 వేల కోట్ల రూపాయలని పేర్కొన్నారు. మొత్తంగా తెలంగాణలో 36.68 లక్షల మంది రైతులకు రూ.19,198.38 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సివుందని బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులు రైతుల అకౌంట్లో పడితే వాటిని రుణాల కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.