
Minister T Harish Rao: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 13 వేల మంది ఉపాధ్యాయులను త్వరలో నియమిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్న గుండ వెలి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. "హమారా గావ్ హమారా స్కూల్ ప్రోగ్రామ్" కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.7300 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తామని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతకు ముందు మంత్రి హరీశ్ రావు జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలో 143 మంది రైతులకు జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలసి తుంపర సేద్య పరికరాలు, ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయ రంగ బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నప్పటికీ.. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నదని తెలిపారు. పక్కనున్నఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ.. తెలంగాణలో కరెంట్ కోతలు లేవని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగం కోసం అనేక మెరుగైన పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు. ఒక్క యూనిట్ కు రూ.20 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తూ.. రాష్ట్ర రైతులకు ఉచితంగా అంతరాయం లేకుండా విద్యుత్ ను అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అన్నదాతలు సహకరించాలన్నారు. సాంప్రదాయేతర పంటలతో రైతులకు మంచి లాభాలు ఉంటాయని తెలిపారు. సెరి కల్చర్, ఆయిల్ ఫామ్, కమర్షియల్ పంటలు పండించాలని రైతులకు సూచించారు. అంతకు ముందు రోజు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దళిత బంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకమని, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. దళిత బందును పార్టీలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.17,800 కోట్లు కేటాయించి 2 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చింది. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వం ఒకే పథకానికి ఇంత మొత్తం ఖర్చు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దళితుల బంధు పథకాన్ని అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకుందని హరీశ్ రావు అన్నారు. దళిత బంధు ద్వారా అందిన సొమ్మును లబ్ధిదారులు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.