చావనైనా చస్తాం కానీ.. అమ్ముడుపోం : ఎమ్మెల్యేల కొనుగోలుపై స్పీకర్ పోచారం సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 6, 2022, 4:55 PM IST
Highlights

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చావనైనా చస్తాం కానీ.. ప్రభుత్వాన్ని మాత్రం వీడేది లేదన్నారు. టీఆర్ఎస్‌లో వున్న ఏ ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదని పోచారం స్పష్టం చేశారు. 
 

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చావనైనా చస్తాం కానీ.. ప్రభుత్వాన్ని మాత్రం వీడేది లేదన్నారు. ప్రభుత్వాలను కూలదోయాలనుకోవడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని.. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పోచారం శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసునన్న ఆయన... ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఆశీర్వదించినవారు అధికారంలోకి వస్తారని అన్నారు. 

స్పీకర్ హోదాలో వున్నందున కొంత పరిమితితోనే మాట్లాడుతున్నానని... పాదయాత్రల పేరుతో ఆరోపణలు చేయటం సరికాదని పోచారం దుయ్యబట్టారు. పాదయాత్రలను తప్పుబట్టమని.. కానీ తమ ప్రభుత్వం కంటే భిన్నంగా ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకానీ, ప్రభుత్వాలను కూలదోయడం, ప్రభుత్వాలను పడగొట్టడం, శాసనసభ్యులను కొనుగోలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. టీఆర్ఎస్‌లో వున్న ఏ ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదని పోచారం స్పష్టం చేశారు. 

Also REad:నీ ప్రభుత్వం కూలుతుందని మోడీనే అన్నారు.. దొంగల్ని పట్టుకుని లోపలేశాం : ఫాంహౌస్‌ కేసుపై కేసీఆర్

ఇకపోతే... ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతామంటారని.. స్వయంగా ప్రధాని మోడీనే ప్రభుత్వాన్ని పడగొడతానని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా వుంటుందా అని సీఎం ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారని కేసీఆర్ ఆరోపించారు. విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని.. మొన్న హైదరాబాద్‌కు దొంగలు వచ్చారని , టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే దొరకబట్టి జైల్లో వేశామని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాజకీయాల్లోకి అందరం కలిసిపోదామని.. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి పాటుపడదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దామన్నారు. 

click me!