భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటీష్ వారు కాదు పోరాడి సాధించుకున్న సమరయోధులు గొప్పవారని... తెలంగాణను కూడా సాధించినవారే గొప్పవారని స్పీకర్ పోచారం అన్నారు.
హైదరాబాద్ : భారత స్వాతంత్య్ర వేడుకలు తెలంగాణ అసెంబ్లీలో ఘనంగా జరిగాయి. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం ఎందరో మహానియుల పోరాట ఫలితమని అన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన శాంతియుత పోరాటంద్వారానే స్వాతంత్య్రం లభించిందని... ఆ స్వేచ్చనే నేడు మనం అనుభవిస్తున్నామని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం పోరాడి సాధించుకున్నాం... బ్రిటీష్ వారు ఊరికే ఇవ్వలేదని అన్నారు. కాబట్టి స్వాతంత్య్రం ఇచ్చినవారు గొప్పవారు కాదు పోరాడి సాధించిన మహనీయులు గొప్పవారని స్పీకర్ పోచారం పేర్కొన్నారు.
undefined
వీడియో
దేశానికి స్వాతంత్య్రం మాదిరిగానే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతంగా పోరాడి తెచ్చుకున్నామని స్పీకర్ అన్నారు. ఇలా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాదు పోరాడి సాధించిన కేసీఆర్ గొప్పవారని పోచారం పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని స్పీకర్ పోచారం అన్నారు.
Read More 77వ ఇండిపెండెన్స్ డే: ప్రగతి భవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరించిన కేసీఆర్
తెలంగాణ ఏర్పాటుతో అభివృద్ది కుంటుపడుతుందన్న దుష్ప్రచారానికి కేసీఆర్ సుపరిపాలనతో సమాధానం చెప్పారని స్పీకర్ అన్నారు. ధాన్యం ఉత్పత్తి, తలసరి ఆధాయం, విద్యుత్తు తో సహా అనేక రంగాలలో దేశంలోననే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 70లక్షల టన్నుల నుండి 3 కోట్లకు పెరిగిందని మెచ్చుకొన్నారని గుర్తుచేసారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతబీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు అందిస్తోందని... ఇలాంటివి దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేవన్నారు. తెలంగాణ పరిపాలన దేశానికి దిక్చూచిగా నిలిచిందని స్పీకర్ పోచారం అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు సమానత్వంగా జీవించడమే అసలైన స్వాతంత్య్రం... తెలంగాణలో అదే స్పూర్తితో పాలన సాగుతోందని అన్నారు. బాద్యతాయుతమైన పదవుల్లో వున్నవారు ప్రజలందరినీ సమానంగా చూడాలని... కేసీఆర్ చేస్తున్నది అదే అన్నారు. స్వాతంత్ర్యం అందరి హక్కు అనే ఉద్యేశంతో పరిపాలన సాగుతోందని స్పీకర్ తెలిపారు.
తెలంగాణలోని ప్రతి గ్రామం అభివృద్ది చెందుతోంది, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారు... గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనని పోచారం తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచుతున్నారని అన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం... ప్రజాసేవలో పునరంకితం అవుదాం అంటూ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.