తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగానే దానిపై మాట్లాడే అవకాశాన్ని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఇచ్చారు స్పీకర్. కానీ 42 పేజిల నోట్ ను చదివేందుకు సమయం కావాలని హరీష్ కోరారు.
హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ల మధ్య వాడివేడి చర్చ జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసారు. దీనిపై స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇచ్చిన స్పీకర్ ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం ఇవ్వగా తమకు కొంత సమయం కావాలని కోరారు. మిగతా పార్టీలు కూడా సమయం కోరడంతో స్పీకర్ అరగంట పాటు సభను వాయిదా వేసారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు అప్పులు రూ.72,658 కోట్లు వుంటే ప్రస్తుతం అవి రూ.6,71,757 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2014 నుండి 2022 వరకు రాష్ట్ర అప్పులు సగటున 24 శాతం పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2022 నాటికి అప్పుల రాష్ట్రంగా మారిందని ప్రభుత్వం తెలిపింది. తమ ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ది పథకంలో నడిపి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామని ఆర్థిక మంత్రి భట్టి పేర్కొన్నారు.
ఇలా బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలచేసింది. ఈ ప్రతులను ప్రతిపక్ష పార్టీల నాయకులకు అందించి స్వల్పకాల చర్చను ప్రారంభించారు స్పీకర్. అయితే శ్వేతపత్రాన్ని కనీసం చదవకుండా చర్చించడం సాధ్యంకాదని...తమకు కాస్త సమయం ఇవ్వాలని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు కోరారు. ఎంఐఎం నేత అక్బరుద్దిన్ కూడా సమయం కోరారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేసి వారికి సమయం ఇచ్చారు.