Telangana Assembly : బీఆర్ఎస్ చేసిన అప్పులు బయటపెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందా?

By SumaBala Bukka  |  First Published Dec 21, 2023, 9:16 AM IST

బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులను ఎక్స్ పోజ్ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిందా? ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? బుధవారం సభలో ఏం జరిగింది? బీఆర్ఎస్ ఎలా సమర్థించుకుంది? అప్పులు వాస్తవమేనా? బీఆర్ఎస్ ఏమంటుంది?


హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాతి నుంచి ఇప్పటివరకు అధికారంలోఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బుధవారం నాడు అసెంబ్లీలో అధికార పార్టీ శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల లెక్కలు అన్నింటిని అసెంబ్లీలో బయట పెట్టింది. ఇప్పటివరకు బయటపడని ఎన్నో విషయాలు ఈ శ్వేత పత్రం ద్వారా వెలుగు చూసాయి. 

రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏఏ కార్పొరేషన్ పేరుతో ఎంత అప్పులు చేసిందనే విషయాలు స్పష్టంగా శ్వేత పత్రంలో బయటపెట్టారు. గత పదేళ్లుగా ఈ విషయాలపై స్పష్టత లేదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్న విషయం మాత్రమే తెలుసు కానీ ఎంత అప్పు,  ఏ కార్పొరేషన్ కింద ఉంది అనే విషయం ఇప్పటివరకు రహస్యంగానే ఉంది.

Latest Videos

undefined

ఈ విషయంపై  అసెంబ్లీలో చర్చ సమయంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. శ్వేత పత్రంలో చూపించిన లెక్కలు తప్పుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ లెక్కలు అన్నింటిని ఆంధ్ర అధికారితో చేయించారని ఎద్దేవా చేశారు. దీనిమీద  ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. మీకు కావాలంటే అధికారి ఎవరో కూడా చెబుతాం.  తెలంగాణలో ఉన్న వారినే వినియోగించుకుంటాం. మీలాగా  ఆంధ్రకు కేటాయించిన అధికారులను, రిటైర్ అయిన ఆంధ్ర అధికారులను తీసుకువచ్చి ప్రధాన సలహాదారులుగా, ముఖ్యపదవుల్లో నియమించుకోలేదంటూ చురకలంటించారు.

Adilabad : బస్సులో సీటు కోసం ఎంతకు తెగించాడు...!

రాష్ట్రం 10 ఏళ్లలో అప్పులకుప్పగా మారింది అనే విషయంపై మాత్రం పూర్తిస్థాయిలో హరీష్ రావు ఖండించలేకపోయారని చెప్పొచ్చు. అంతేకాదు అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అనుమతి ఇవ్వాలంటూ హరీష్ రావు కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, పెరిగిన సంపదను ఈ పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ రూపంలో సభలో  ప్రదర్శించాలని.. దీనికి అనుమతి కావాలని కోరారు. కానీ స్పీకర్ దీనికి అంగీకరించలేదు. 

దీంతో ఎమ్మెల్యే హరీష్ రావు  ఆ గణాంకాలనే.. ప్రతి సమస్యకు.. ప్రతి ప్రశ్నకు  సమాధానంగా చదువుతూ రావడం ఆశ్చర్యం కలిగించింది. హరీష్ రావు ఒక్కడిగా  అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఆర్థిక మంత్రి,  ముఖ్య మంత్రులకు సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు.. హరీష్ రావుకు,  బట్టి విక్రమార్క హరీష్ రావు, రేవంత్ రెడ్డి హరీష్ రావు… ఇలా మాటల యుద్ధం జరిగింది.

ఓ సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేచి మాట్లాడబోతుంటే… ‘నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదు’ అంటూ  వ్యంగ్యాస్త్రం వదిలారు హరీష్ రావు. దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తూ… ‘నాకు మంత్రి పదవి వస్తుందో, రాదో మా అధిష్టానం నిర్ణయిస్తుంది కానీ..  నిన్ను మాత్రం  తండ్రీకొడుకులు పూర్తిగా వాడుకుంటున్నారు. నీతో అన్ని చేయించుకుని నిన్ను పక్కకు పెడుతున్నారు.. అది గుర్తుంచుకో’ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. 

శ్వేతపత్రం ప్రవేశపెట్టిన తర్వాత ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని.. ఈ పదేళ్లలో తీవ్రమైన అప్పులలో కూరుకుపోయిందని  చెప్పుకొచ్చారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ పేరుతో లెక్కల్లోకి రాకుండా చాలా తెలివిగా అప్పులు చేశారని తెలిపారు. ఈ అప్పుల కారణంగానే బడ్జెట్లో ఒక వంతు వడ్డీలు కట్టడానికి, రీపేమెంట్ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.  ఎఫ్ఆర్ బీఎం  నిబంధనలను కూడా ఉల్లంఘించారని.. లెక్కలతో సహా ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించింది.

ఈ పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల ప్రభావంతో ప్రతి ఒక్కరిపై ఎంత మేర అప్పు ఉండనుందో చెప్పుకొచ్చింది. తలసరి రుణ భారం ఏ స్థాయిలో ఉందో కూడా చెప్పింది. అభివృద్ధి కోసమే అప్పులు చేశామని, వాటిని అభివృద్ధి కోసమే ఖర్చు చేశామని హరీష్ రావు వివరణ ఇచ్చారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం టీ డబ్బులకు కూడా ఓడీలు పెట్టుకోవాల్సిన దారుణమైన స్థితి అని చెప్పుకొచ్చారు.

అభివృద్ధి జరిగితే దాని ద్వారా వచ్చే ఆదాయం కనిపించాలని.. కానీ,  నాయకుల ఆస్తుల్లో పెరుగుదల కనిపించింది కానీ అభివృద్ధిలో కాదంటూ ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో సెకండ్ టర్మ్ లో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. దీనితో వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత హరీష్ రావు పై పడింది. అప్పులు చేసిన మాట వాస్తవమే కానీ.. అభివృద్ధి కోసమే అంటూ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత మాట్లాడిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారి జీతాలు ఇవ్వడంలో కూడా వైఫల్యం చెందారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగలేదని, గ్రూప్స్ పేపర్ లీకులతో విద్యార్థుల్లో అపనమ్మకాన్ని పెంచారని.. మరోవైపు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఈ పదేళ్లలో అప్పుల ఊబిలో ముంచారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బుధవారం రాత్రి 8 గంటలవరకు సాగింది. ఆ తరువాత గురువారం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మొత్తంగా గత పదేళ్లలో  బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను, పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం  బట్టబయలు చేసినట్టుగానే ఉంది. ఇక గురువారం నాడు అసెంబ్లీలో విద్యుత్ కు సంబంధించిన శ్వేత పత్రాన్ని  ప్రవేశపెట్టనున్నారు. 

click me!