
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023 నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిపే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సీట్లు ఆశించిన నాయకుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇదే సమయంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లోకి వస్తుండటం గమనార్హం. ఖమ్మం బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరగా, బుధవారం నిర్మల్ జిల్లాల్లో కూడా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు కారేక్కారు.
వివరాల్లోకెళ్తే.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బుధవారం నిర్మల్‌లో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (BRS) మాత్రమే గ్రౌండ్ లెవల్ లో ప్రజల అవసరాలను తీర్చగలదనీ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలదని నమ్ముతున్నందున తాము కాషాయ పార్టీని విడిచిపెట్టినట్లు బీఆర్ఎస్ లో చేరిన సభ్యులు పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ సెగ్మెంట్‌ను బీఆర్‌ఎస్ నిలబెట్టుకోగలదని కార్యకర్తలు పేర్కొన్నారు. బీజేపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 'బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటూ పార్టీకి సేవలందిస్తున్న సభ్యులను పట్టించుకోలేదు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల అదృష్టాన్ని ప్రభావితం చేస్తూ, పార్టీ సిద్ధాంతాలను మరిచిపోయారు' అని బీఆర్ఎస్ లో చేరిన వారు పేర్కొన్నారు.
ఇదిలావుండగా, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు రక్షకుడిగా నిలిచారన్నారు. బ్యాటరీతో నడిచే 46 వీల్ చైర్లు, తొమ్మిది మూడు చక్రాల కుర్చీలు, 154 వినికిడి పరికరాలు, 43 కృత్రిమ అవయవాలను బుధవారం వికలాంగులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, వారు ఇతరులతో సమానంగా ప్రతిభావంతులని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. వికలాంగుల సంక్షేమానికి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. నెలవారీ పింఛన్ మొత్తాన్ని రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలిచారు. మూడోసారి ఆర్థిక సాయాన్ని పెంచారని పేర్కొన్నారు.