
తెలంగాణ కేబినెట్‌లోకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి స్థానం దక్కిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన నిర్వర్తించిన శాఖను ఎవరికీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు కేసీఆర్. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న పట్నం .. తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పిస్తామని అధిష్టానం తేల్చిచెప్పింది. అయినప్పటికీ మహేందర్ రెడ్డి తన ప్రయత్నాలు తాను చేశారు. ఇదే సమయంలో నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వుంది.
ALso Read: Telangana Assembly Elections 2023: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి?
అయితే బీఆర్ఎస్ పెద్దలు జోక్యం చేసుకోవడంతో పరిస్ధితులు చక్కబడ్డాయి. ఈ క్రమంలో సోమవారం బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటన సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డికే తాండూరు టికెట్ కేటాయించారు కేసీఆర్. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ పెద్దలు సైతం వీటిని ధ్రువీకరించారు.
పట్నం మహేందర్ రెడ్డితో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్‌కి కూడా కేబినెట్‌లోకి స్థానం లభించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈసారి సీఎం కేసీఆర్ .. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడంతో గంప గోవర్ధన్ తన సీటును త్యాగం చేశారు. పార్టీ పట్ల ఆయన విధేయతను పరిగణనలోనికి తీసుకున్న కేసీఆర్ .. గోవర్ధన్‌కు కూడా మంత్రిగా అవకాశం కల్పించారని వార్తలు వచ్చాయి. కానీ రేపు పట్నం మహేందర్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరి చివరి నిమిషంలో గంప గోవర్ధన్‌కి ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.