బీఆర్ఎస్ ఓటమి పక్కా.. తెలంగాణ‌లో రాబోయేది కాంగ్రెస్ స‌ర్కారే.. : ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

By Mahesh Rajamoni  |  First Published Aug 26, 2023, 10:37 PM IST

Hyderabad: రాబోయే తెలంగాణ అసెబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 70కి పైగా సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.
 


Congress MP Uttam Kumar Reddy: తెలంగాణ‌లో రాబోయేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆ పార్టీ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. రాబోయే తెలంగాణ అసెబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 70కి పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే..  తెలంగాణలో రాబోయే ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందనీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీ ఓటమిని చవిచూడటం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతి రెడ్డితో కలిసి కాంగ్రెస్ టికెట్ దరఖాస్తులను సమర్పించిన అనంత‌రం ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 70కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Latest Videos

నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదు రాష్ట్రాల్లో విజయం 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ప్రతిపాదించారు. నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుందని పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీలు నెరవేరలేదనీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. 12 శాతం రిజర్వేషన్ల పేరుతో ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్నారని అన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై 2014లో ప్రధాని మోడీతో చర్చించాననీ, కేసీఆర్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ముస్లింలకు కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందనీ, అది చెక్కుచెదరకుండా ఉందని ఆయన అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. తెలంగాణలో భూకబ్జాలు, ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం వంటి కార్యకలాపాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని ఆరోపించారు.

click me!