బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ తనకు దక్కలేదని తీవ్ర మనస్తాపానికి గురయిన నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఐసియూలో చికిత్స పొందుతుున్నాడు.
నిజామాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అతడు సిద్దమయ్యాడు. ఇందుకోసం అనుచరులను, కార్యకర్తలను సంసిద్దం చేసి అన్నీ సమకూర్చుకున్నాడు. ఎంతోకాలంగా పార్టీనే నమ్ముకుని వున్నాడు కాబట్టి టికెట్ తనకే దక్కుతుందని భావించాడు. కానీ తనకు కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన నాయకుడికి టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన ఆ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేందుకు స్థానిక నేత కాసుల బాలరాజు సిద్దమయ్యాడు. చాలాకాలంగా పార్టీలో కొనసాగుతున్న తనకే టికెట్ వస్తుందని ఆశించాడు. కానీ ఆ సీటును ఇటీవలే బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన బాలరాజు తన అనుచరులతో కలిసి ఇంటివద్దే ఆమరణ దీక్ష చేపట్టాడు.
కాంగ్రెస్ అధిష్టానం బాన్సువాడ టికెట్ విషయంలో మరోసారి ఆలోచించాలని... వలస నేతను తప్పించి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ బుధవారం ఉదయం ఆమరణ దీక్షకు కూర్చున్నాడు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చానని... పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చిన స్థానిక నాయకుడిగా తనను ఎమ్మెల్యేగా పోటీచేసే అన్ని అర్హతలు వున్నాయన్నారు. కానీ తనకు కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన స్థానికేతర నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని ఆయన పార్టీ పెద్దలను ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగిందంటూ బాలరాజు కన్నీరు పెట్టుకున్నాడు.
Read More రేవంత్ రెడ్డిపై కేసు నమోదుకు బీఆర్ఎస్ డిమాండ్.. ఎందుకంటే..?
ఆమరణ దీక్షకు కూర్చున్న బాలరాజు మద్యాహ్నం ఇంట్లోని బాత్ రూం లోకి వెళ్లాడు. బయటకు వచ్చిన అతడు వాంతులు చేసుకోవడంతో అనుమానం వచ్చి అనుచరులు బాత్రూంలోకి వెళ్లిచూడగా పురుగుల మందు డబ్బా వుంది. దీంతో వెంటనే బాలరాజును స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుండి ఆయనను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఐసియూలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
బాలరాజు ఆత్మహత్యాయత్నం అతడి కుటుంబసభ్యులు, అనుచరులను షాక్ కు గురిచేసింది. ఐసియూలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ బిఆర్ఎస్ నేత పోచారం భాస్కర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ హాస్పిటల్ కు చేరి బాలరాజును పరామర్శించారు. డాక్టర్లను అడిగి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.