భూపాలపల్లి బిఆర్ఎస్ అలజడి... గండ్రకు టికెటిస్తే 150మంది ఉద్యమకారులూ బరిలో అట...

By Arun Kumar P  |  First Published Aug 20, 2023, 2:14 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా రెడీ అయ్యిందన్న ప్రచారం నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. 


వరంగల్ : అధికార బిఆర్ఎస్ టికెట్ల పంచాయితీలతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ప్రధాన ప్రతిపక్షాలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో వుండగానే బిఆర్ఎస్ అధినేత మాత్రం ఈసారి పోటీచేసే అభ్యర్థుల లిస్ట్ సిద్దం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రేపు శ్రావణ సోమవారం మంచిరోజు కాబట్టి బిఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను కేసీఆర్ ప్రకటించవచ్చంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి కేసీఆర్ టికెట్ ఖరారు చేసి ప్రకటిస్తే మార్చే అవకాశమే వుండదు. కాబట్టి అంతకు ముందే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసారు బిఆర్ఎస్ నాయకులు. ఇలా భూపాలపల్లి టికెట్ ఆశిస్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. 

తెలంగాణ ఉద్యమకాలం నుండి బిఆర్ఎస్ పార్టీలోనే వుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడైన మధుసూధనాచారికి భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచి బిఆర్ఎస్ లోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అవకాశం ఇవ్వొద్దని మాజీ స్పీకర్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అలాకాదని గండ్రకే టికెట్ ఇస్తే 150 మంది ఉద్యమకారులు నామినేషన్ వేయడానికి సిద్దంగా వున్నారని బిఆర్ఎస్ అదిష్టానాన్ని హెచ్చరించారు. 

Latest Videos

undefined

Read More  నేనే కాదు... ఎవరు పోటీచేసినా గెలిపించండి..: జగిత్యాల ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

భూపాలపల్లి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకే బిఆర్ఎస్ టికెట్ దక్కవచ్చన్న ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్ లో మధుసూదనాచారి వర్గీయులు సమావేశమయ్యారు. ఇతర పార్టీలనుండి వచ్చినవారికి కాకుండా ఎప్పటినుండో పార్టీలో కొనసాగుతూ బలోపేతం చేసిన మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలని బిఆర్ఎస్ అదిష్టానాన్ని కోరారు. లేదంటే ఉద్యమకారులం పోటీకి దిగుతామంటూ మాజీ స్పీకర్ వర్గం బిఆర్ఎస్ అదిష్టానాన్ని హెచ్చరించారు. 

ఇదిలావుంటే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అధికార బిఆర్ఎస్ లో టికెట్ల లొల్లి మొదలయ్యింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి కేసీఆర్ అవకాశం ఇవ్వడంలేదంటూ సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియా మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా చోట్ల సిట్టింగ్ లు అప్రమత్తమై తమ అనుచరులతో ఇప్పటికే రాజకీయ భవిష్యత్ గురించి చర్చలే జరుపుతున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు ఈసారి బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే కేసీఆర్ నిర్ణయమైతే తాము చాలా సంతోషిస్తామని... తాము కోరుకునేది కూడా ఇదేనంటూ కొందరు ఇల్లందు బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కూడా టికెట్ దక్కకపోవచ్చని... అలాగని ఈ టికెట్ ఆశిస్తున్న జిహెచ్ఎంసి మాజీ మేయర్ కు కూడా ఆ  అవకాశం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుండి  మాజీ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి  పేరును బీఆర్ఎస్  నాయకత్వం  పరిశీలిస్తుందనే  ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మేయర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎస్సీ రిజర్వుడ్ జహిరాబాద్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుపై ప్రజా వ్యతిరేకత దృష్ట్యా ఇటీవలే బిఆర్ఎస్ లో చేరిన నరోత్తంకు టికెట్ ఇవ్వాలని అదిష్టానం భావిస్తోందట. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన నెలకొంది. 

click me!