నిర్మల్ కు వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు ఆదివారంనాడు అరెస్ట్ చేశారు.నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరహార దీక్ష చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు ఇవాళ నిర్మల్ సరిహద్దులో అరెస్ట్ చేశారు.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఐదు రోజుల క్రితం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు బీజేపీ పిలుపునిచ్చింది.అయితే ఈ ధర్నా చేయకుండా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన తన నివాసంలోనే నిరహార దీక్ష చేస్తున్నారు. దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి బీజేపీ నేతలు సంఘీభావం తెలిపేందుకు వస్తున్నారు.ఈ క్రమంలో ఇవాళ నిర్మల్ వస్తున్న డీకే అరుణను పోలీసులు నిర్మల్ సరిహద్దులోనే అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దూద్గం చౌరస్తా వద్ద పోలీసులు డీకే అరుణను అరెస్ట్ చేశారు.
ఎస్పీ అనుమతితోనే తాను నిర్మల్ కు వస్తున్నట్టుగా మాజీ మంత్రి డీకే అరుణ మీడియాకు చెప్పారు. అనుమతి ఉన్నా తనను అడ్డుకోవడం దారుణమన్నారు.పోలీసులతో ప్రభుత్వమే రెచ్చగొట్టిస్తుందని ఆమె ఆరోపించారు.