తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నవారు పాార్టీ టికెట్ దక్కకున్న నేడు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఇలా వేములవాడలో బిజెపి రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్ కు సిద్దమవుతున్నారు.
వేములవాడ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేటితో(శుక్రవారం) అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో ఏం చేసినా ఇవాళే చేయాలని ప్రధాన పార్టీల్లోని రెబల్ అభ్యర్థులు భావిస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకున్నా చాలామంది నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్నారు. తర్వాత ఏమైతే అదయ్యింది... ఇప్పుడయితే నామినేషన్ వేసేద్దామని అనుకుంటున్నారు. ఇలా వేములవాడలో బిజెపి రెబల్ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి సిద్దమయ్యారు. దీంతో వేములవాడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
వేములవాడ అసెంబ్లీలో బిజెపి అభ్యర్థిగా తుల ఉమ బరిలోకి దిగుతున్నారు. ఈ టికెట్ కోసం తీవ్ర పోటీ వున్నా బిజెపి అదిష్టానం ఉమపై నమ్మకం వుంచింది. దీంతో టికెట్ ఆశించిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీనుండి తప్పుకోబోమంటూ బిజెపికి రెబల్ గా నామినేషన్ వేయడానికి సిద్దమయ్యారు. ఇవాళ నామినేషన్లకు చివరిరోజు కావడంతో అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకోవాలని బిజెపి రెబల్ అభ్యర్థులు కోరుతున్నారు.
undefined
ఇటీవలే బిజెపిలో చేరిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు వేములవాడ టికెట్ ఆశించాడు. ఆ హామీ లభించడంతోనే ఆయన బిజెపిలో చేరినట్లు తెలుస్తోంది. కానీ వేములవాడలో ఈటల రాజేందర్ వర్గానికి చెందిన తుల ఉమకు అవకాశం ఇవ్వడంతో వికాస్ రావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తూ నేడు నామినేషన్ వేయడానికి సిద్దమయ్యారు.
Read More తిరిగి బిఆర్ఎస్ సర్కార్ వచ్చినా... ఈసారి కూల్చేయడం ఖాయం : బండి సంజయ్ సంచలనం
ఇక సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా వేములవాడ టికెట్ ఆశించారు. ఆయనకు కూడా మొండిచేయి చూపించడంతో బిజెపికి రెబల్ గా నామినేషన్ వేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. చివరిరోజయిన ఇవాళ నామినేషన్లు దాఖలుచేసి వేములవాడ పోటీలో నిలవాలని ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే వేములవాడ బిజెపి శ్రేణులు తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.మూడు రోజులుగా బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ఈటల వర్గం మాత్రం ఉమకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా వేములవాడలో బిజెపి వర్గపోరు మరీ ఎక్కువయ్యింది... దీంతో ఏటూ తేల్చుకోలేక బిజెపి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.