తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడారు. బిఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసారు కేసీఆర్.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ హవా ముందు కారు నిలవలేకపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓటమిపాలయ్యారు. బిఆర్ఎస్ ఓటమి ఖాయం కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ అధికారికి నివాసాన్ని కూడా వీడారు. సిఎంవో ప్రధాన కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందించిన కేసీఆర్ గవర్నర్ కు సమర్పించాల్సిందిగా సూచించారు. ఆ వెంటనే ప్రగతిభవన్ నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.
అయితే ప్రగతి భవన్ నుండి ఎప్పుడూ ఉపయోగించే ప్రభుత్వ వాహనంలో కాకుండా సొంత కారులో వెళ్లిపోయారు కేసీఆర్. సెక్యూరిటీ సిబ్బందిని కూడా తన వెంట రావద్దని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. కాన్వాయ్, ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా కారులో ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయారు మాజీ సీఎం కేసీఆర్. కేవలం బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాత్రమే కేసీఆర్ వెంట కారులో వెళ్లారు.
ఇదిలావుంటే ఇప్పటికే గవర్నర్ తమిళిసై రాజీనామాను ఆమోదించడంతో కేసీఆర్ మాజీ సీఎంగా మారిపోయారు. అయితే నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించేవరకు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ ను కోరారు గవర్నర్ తమిళిసై. అయినప్పటికీ కేసీఆర్ సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్ ను వీడారు.
Also Read Telangana Elections 2023 : హేమాహేమీల ఓటమి... బిజెపి పరాభవానికి కారణాలివే...
మరోవైపు ప్రభుత్వ ఏర్పాట్లుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ముందుగా అనుకున్నట్లు ఎలాంటి క్యాంపులు, హడావుడి లేకుండా ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను చేపట్టింది కాంగ్రెస్ అదిష్టానం. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో హైదరాబాద్ లోని ఓ హోటల్లో సిఎల్పి సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సమావేశంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి పరిశీలకులు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించే ఆ నివేదికను పార్టీ అధిష్టానానికి పంపించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న తుది నిర్ణయం కాంగ్రెస్ అదిష్టానమే తీసుకోనుంది.