24 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి కృష్ణా యాదవ్ పోటీకి దిగుతున్నారు. చంద్రబాబు కేబినెట్ లో కృష్ణా యాదవ్ మంత్రిగా పనిచేశారు. స్టాంపుల కుంభకోణంలో అరెస్టైన తర్వాత రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్: అంబర్ పేట అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు బీజేపీ టిక్కెట్టు కేటాయించింది. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ను పార్టీ చేరిక విషయమై తొలుత కొందరు బీజేపీ నేతలు వ్యతిరేకించారు. పార్టీలో చేరేందుకు ర్యాలీగా అనుచరులతో కృష్ణ యాదవ్ వెళ్లిన సమయంలో చివరి నిమిషంలో ఆయన చేరిక నిలిచిపోయింది. కృష్ణ యాదవ్ చేరిక విషయమై పార్టీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారని అప్పట్లో ప్రచారం సాగింది. కృష్ణ యాదవ్ పై కేసుల అంశాన్ని కొందరు నేతలు సాకుగా చూపారని ప్రచారం కూడ లేకపోలేదు. కృష్ణ యాదవ్ చేరిక విషయమై తమతో చర్చించకపోవడంపై కొందరు నేతలు అభ్యంతరం చెప్పారనే ప్రచారం కూడ పార్టీలో నెలకొంది. ముందుగా నిర్ణయించిన రోజున కాకుండా మరో రోజున కృష్ణా యాదవ్ బీజేపీలో చేరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు కేబినెట్ లో కృష్ణాయాదవ్ మంత్రిగా పనిచేశారు. ఆనాడు హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కృష్ణాయాదవ్ టీడీపీ అభ్యర్ధిగా పలుదఫాలు ప్రాతినిథ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంబర్ పేటగా మారింది. కృష్ణా యాదవ్ స్టాంపుల కుంభకోణంలో అరెస్టైన తర్వాత అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. దీంతో కృష్ణా యాదవ్ కు బీజేపీ ఈ స్థానంలో టిక్కెట్టు కేటాయించింది.
also read:బీజేపీ మూడో అభ్యర్ధుల జాబితా విడుదల: 35 మందికి చోటు
2014 ఎన్నికలకు ముందు కృష్ణా యాదవ్ టీడీపీలో తిరిగి చేరారు. అయితే ఈ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు కారణంగా కృష్ణా యాదవ్ కు పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కృష్ణాయాదవ్ టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో కూడ సరైన ప్రాధాన్యత లేదని ఆయన అసంతృప్తితో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల కృష్ణా యాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో హిమాయత్ నగర్ నుండి కృష్ణా యాదవ్ టీడీపీ అభ్యర్ధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించారు. 2004 ఎన్నికలకు ముందు ఆయనను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాంపుల కుంభకోణంలో మంత్రిగా ఉన్న కృష్ణాయాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. స్టాంపుల కుంభకోణం కేసులో కృష్ణాయాదవ్ కు కోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.
2014 ఎన్నికలకు ముందు కృష్ణా యాదవ్ టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో కూడ ప్రాధాన్యత లేకపోవడంతో బీజేపీలో చేరారు.