రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు... కానీ ముఖ్యమంత్రి రేసులో వున్నానంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నల్గొండ : ఏ రాజకీయ నాయకుడికైనా ముఖ్యమంత్రి పదవిపై ఆశ వుంటుంది. అయితే కొందరు నాయకుల అదృష్టం కొద్దీ అనుకోకుండానే ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది. ఇలాగే తనకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం హటాత్తుగా రావచ్చేమో అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇంతకాలం సీఎం పదవి ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అది నెరవేరకుండానే రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఈసారి నాగార్జున సాగర్ నుండి ఆయన కాకుండా కొడుకు రఘువీర్ ను బరిలోకి దింపారు. కానీ ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఆశతోనే వున్నట్లు ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది. అవకాశం వస్తే మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా వున్నానంటూ జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీచేయకున్నా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తనకు ముఖ్యమంత్రి పదవి వరించవచ్చేమో అంటూ కాంగ్రెస్ కార్యకర్తల ముందు మనసులో మాట బైటపెట్టారు జానారెడ్డి.
నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు తాను ఆశించకుండానే పదవులు వరించాయని...ఇలాగే ముఖ్యమంత్రి పదవి కూడా హఠాత్తుగా రావొచ్చేమో అని జానారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా, 55 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన తనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అన్ని అర్హతలు వున్నాయని జానారెడ్డి అన్నారు. ఇరవై ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చిన తాను 36ఏళ్లకే మంత్రి అయ్యానని... ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదని అన్నారు. ఏ ముఖ్యమంత్రీ నిర్వర్తించనన్ని శాఖలు తాను చేపట్టానని జానారెడ్డి తెలిపారు.
తాను ఎప్పుడూ పదవుల వెంట పడలేదని... పదవులే తనవద్దకు వచ్చాయన్నారు జానారెడ్డి. ఇలా సీఎం పదవి కూడా సమయం వచ్చినపుడు తనవద్దకే వస్తుందన్నారు. ఈసారి అలాంటి అవకాశం వుంటే తన కొడుకు రాజీనామా చేస్తాడని... తాను తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.