
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆరోపించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సంఘం రాష్ట్ర నాయకులు కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 3 వల్ల ఉత్తరాంధ్ర బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వారికి న్యాయం చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదని అన్నారు.
హైదరాబాద్‌లో దాదాపు పది లక్షల మంది ఉత్తరాంధ్ర బీసీలు స్థిరపడ్డారని, వీరందరికీ జీవో నెంబర్ 3తో తెలంగాణ సర్కారు అన్యాయం చేస్తున్నదని తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలా లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల ఉత్తరాంధ్ర బీసీలు ఇక్కడ బీసీ జాబితాలో ఉండలేకపోతున్నారని, అందుకే ప్రభుత్వ పథకాలు ఫలాలు, రిజర్వేషన్లకు దూరం అవుతున్నారని తెలిపారు. 2014లోనే తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని, ఏపీలోని 16 ముఖ్యమైన బీసీలను ఆ జాబితా నుంచి తొలగించిందని వివరించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలకు వీరు దూరమయ్యారు. బీసీ జాబితా నుంచి తొలగించడంతో వీరంతా ఓసీ జాబితాలోకి వచ్చారని తెలిపారు.
Also Read: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీల భేటీ.. వీటిపైనే చర్చ
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వెనుకబడిన తరగతుల్లో ప్రధాన కులాలైన శెట్టి బలిజ (గౌడ), గవర, కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపుతోపాటు మరికొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. తెలంగాణలో గవర, కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపు, శెట్టి బలిజ వంటి కులాలు లేవని, ఒక వేళ ఉన్నా వారంతా స్థానికేతరులేనని వివరించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని గవర్నర్ సమక్షంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారని, కానీ, తెలంగాణ ప్రభుత్వ అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నదని వివరించారు.
హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ పని చేసే కార్మికుల్లో 75 శాతం మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారేనని, వీరిలో కాళింగ, గవర సామాజిక వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉంటారని తెలిపారు. ఈ సమస్యపై తెలంగాణ గవర్నర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.