
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ ప్రణాళికలు రచించారు. బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చిన సమయంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశం అవతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర పర్యటనకు వస్తున్న జేపీ నడ్డా కూడా.. ఇద్దరు ప్రముఖులను కలవనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా జేపీ నడ్డా రేపు మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
ఆయన సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనంద శంకర్ జయంత్‌లను కలవనున్నారు. జేపీ నడ్డా ప్రొ. నాగేశ్వర్ ఇంటకి వెళ్లి ఆయనను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు ఆయన నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. ఒక గంటపాటు ఆ హోటల్‌లోనే జేపీ నడ్డా ఉంటారు. అనంతరం, సాయంత్రం 4.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ సభకు వెళ్లుతారు. ఒక అరగంటలో అక్కడికి చేరుకుంటారు.
నాగర్ కర్నూల్‌లో జెడ్‌పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటారు. అనంతరం, 6.10 గంటలకు అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. అరగంటకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.40 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి కేరళ రాజధాని తిరువనంతపురంకు వెళ్లనున్నారు.
అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై అసంతృప్తితో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్నారు. అయితే వారితో బీజేపీ అధిష్టానం చర్చలు ఏ విధమైన ఫలితం ఇస్తుందో వేచిచూడాల్సి ఉంది.