హైదరాబాద్ నుంచి నాసిక్ వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో సాంకేతికలోపం..

By Sumanth KanukulaFirst Published Dec 6, 2022, 10:56 AM IST
Highlights

హైదరాబాద్ నుంచి నాసిక్ వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. ఈ క్రమంలోనే విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించారు.

హైదరాబాద్ నుంచి నాసిక్ వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. ఈ క్రమంలోనే విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాలు.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి స్పైస్‌జెట్ విమానం నాసిక్‌కు బయలుదేరింది.  హైదరాబాద్ నుంచి కొంతదూరం ప్రయాణించిన తర్వాత విమానం సాంకేతిక లోపం గుర్తించారు. వెంటనే తిరిగి వెనక్కి మళ్లించారు. దాదాపు 30 నిమిషాల ప్రయాణం తర్వాత విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 80 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

అయితే ఈ క్రమంలోనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో విమానం కోసం ప్రయాణికులు నాలుగు గంటల నుంచి ఎదురుచూస్తున్నారు. తకు తమకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి సరైన స్పందన లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేపట్టారు.

ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి కేరళలోని కోజికోడ్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం హైడ్రాలిక్ వైఫల్యంతో శుక్రవారం సాయంత్రం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా 197 మంది ప్రయాణికులు ఉన్నారు. కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన స్పైస్‌జెట్-ఎస్‌జి 036 విమానాన్ని కొచ్చికి మళ్లించిన తర్వాత సాయంత్రం 6:29 గంటలకు కొచ్చిన్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సాయంత్రం 7:19 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేని పరిశీలించామని, అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నామని అధికారులు తెలిపారు. 
 

click me!