క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా చర్యలు.. మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసు పంపిన మాణిక్కం ఠాగూర్..

By Sumanth KanukulaFirst Published Dec 6, 2022, 10:03 AM IST
Highlights

బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డికి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు.

బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డికి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు. మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకానికి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ ఈ లీగల్ నోటీసు పంపారు. శశిధర్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అలా క్షమాపణ చెప్పని పక్షంలో చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శశిధర్ రెడ్డి ఠాగూర్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా ఠాగూర్ రూ. 25 కోట్ల రూపాయలకు పైగా లంచం తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఠాగూర్ ప్రతిష్టను దిగజార్చడం, రాజకీయ వర్గాల్లో ఆయనకు కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని నోటీసులో పేర్కొన్నారు. శశిధర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రోజున కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో  ఠాగూర్‌పై తీవ్ర అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన తర్వాత ఒక వారం వ్యవధిలో క్షమాపణలు చెప్పాలని కోరారు. లేకపోతే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. 

మరోవైపు మాణిక్కం ఠాగూర్ తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ మాజీ నేతలు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డిలపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. 

click me!